ఆడబిడ్డలకు గౌరవమిచ్చే రాష్ట్రం తెలంగాణ

6 Feb, 2021 14:10 IST|Sakshi

హైదరాబాద్‌: ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాల అమలు సరిగా జరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 40 శాతం హింసను ఇళ్లల్లోనే ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మనుషులుగా చూడాలని, మహిళలంతా సంఘటితమై తమ సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆడబిడ్డలపై దౌర్జన్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హజీపూర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, మళ్లీ అలాంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించిన కమిషనర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శనివారం జరిగిన సంఘమిత్ర అవార్డుల కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక ‘షీ టీమ్స్‌’ అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. షీ టీమ్స్‌తో పాటు సంఘమిత్ర కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంఘమిత్రలు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతానని చెప్పారు. తనను కూడా సంఘమిత్రలో చేర్చుకోవాలని సీపీని ఈ సందర్భంగా కవిత కోరారు.

మరిన్ని వార్తలు