ఎమ్మెల్సీ కవిత చొరవ: నిండు గర్భిణికి అండగా నిలిచి.. 

25 May, 2021 08:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు గర్భిణికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. సకాలంలో సాయం అందడంతో ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భిణి. ఆమె భర్త క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వైద్యులు సూచించిన తేదీకంటే ముందే జ్యోతిబాయికి పురుటి నొప్పులు రావడంతో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో ఆదివారం మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

ఆపరేషన్‌ ఆర్థికంగా భారం కావడంతో జ్యోతిబాయి బంధువులు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ను ఆశ్రయించారు. కొందరు దాతలు స్పందించినా అవసరమైన డబ్బులు సమకూరకపోగా, కాలయాపనతో జ్యోతిబాయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ విషయం ఎమ్మెల్సీ కవిత దృష్టికి రావడంతో ఆమె తక్షణం స్పందించారు. కవిత చొరవతో క్లిష్టమైన ఆపరేషన్‌ పూర్తి కాగా, సోమవారం జ్యోతిబాయి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్న విషయాన్ని తెలియచేస్తూ ట్విట్టర్‌ ద్వారా కవిత హర్షం వెలిబుచ్చారు. కవిత సాయంతో చలించిపోయిన జ్యోతిబాయి భర్త, మరిది ఇకపై గర్భిణులను తమ క్యాబ్‌ ద్వారా ఆసుపత్రులకు ఉచితంగా తీసుకెళ్తామని ప్రకటించారు.


చదవండి: ట్విట్టర్‌లో స్పందించి.. సాయం అందించి! 

మరిన్ని వార్తలు