మహిళలకు మంచి భవిష్యత్తు

8 Oct, 2023 04:25 IST|Sakshi

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంపై ఎమ్మెల్సీ కవిత

లండన్‌ ‘బ్రిడ్జి ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం

సాక్షి, హైదరాబాద్‌:     మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో భారతీయ మహి­ళల భవిష్యత్తు మెరుగవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. విప్లవాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్ట సభల్లోకి మరింత మంది మహిళలు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ‘మహిళా రిజర్వేషన్లు.. ప్రజా­స్వా­మ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై లండన్‌లో ప్రముఖ పబ్లిక్‌ పాలసీ ఆర్గనై­జేషన్‌ ‘బ్రిడ్జి ఇండియా’ నిర్వహించిన సదస్సులో కవిత శనివారం కీలకోపన్యాసం చేశారు.

ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉండగా బిల్లు అమలైతే ఈ సంఖ్య ఏకంగా 181కి చేరుతుందని ఆమె చెప్పారు. ప్రపంచంలోనే అతి­పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలను ఇంటికే పరిమితం చేయలేరని, ఈ విషయాన్ని గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంలో సానుకూలంగా వ్యవహరించాయని చెప్పారు. 1996లో దేవెగౌడ, 2010లో సోనియా­గాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా బిల్లు కోసం చేసిన కృషికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ఏర్పడిన నెల రోజుల్లోనే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాక బీఆర్‌ఎస్‌ ఎంపీలు అనేకమార్లు లోక్‌సభలో లేవనెత్తారని, కేసీఆర్‌ కూడా కేంద్రానికి అనేక పర్యాయాలు లేఖలు రాశారని తెలిపారు.

అయితే వెనుకబడిన తరగతులకు చెందిన మహిళ­లకు (ఓబీసీ) ప్రత్యేక కోటా లేకపోవడం దురదృష్టకరమని, దీని కోసం తమ పోరాటం కొనసాగు­తుందని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం కవిత చేసిన కృషిని, పోరాటాన్ని పలువురు వక్తలు అభినందించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు

మరిన్ని వార్తలు