రౌడీషీటర్లకు కార్పెట్‌ వేస్తావా.. అంతుచూస్తా

28 Apr, 2022 08:35 IST|Sakshi

సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఫైర్‌

ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశాం: వికారాబాద్‌ ఎస్పీ

సాక్షి, తాండూరు: ‘రౌడీషీటర్లకు కార్పెట్‌ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివా దాస్పద మయ్యాయి. 3 రోజుల క్రితం జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్‌ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్‌ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్‌ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు.

‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసు క అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నాన ని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్‌ కట్‌ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్‌ ఎస్పీ తెలిపారు.

అధికారులకు ఆడియో తలనొప్పి...
జాతర సందర్భంగా జరిగిన తప్పిదాలు పోలీసు ఉన్నతాధికారులకు సమస్యలను తెచ్చిపెట్టాయి. ప్రొటోకాల్‌ ప్రకారం బందోబస్తు నిర్వహించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్సీ, సీఐల మధ్య ఫోన్‌ సంభాషణ ఆడియో బయటకు రావడం కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఈ విషయమై తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్‌రెడ్డిలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

మహేందర్‌ రెడ్డిని అడగ్గా.. ‘పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ప్రొటోకాల్‌ను పాటించట్లేదు. ఫోన్‌లో నేను తిట్టింది వాస్తవమే’ అని తెలిపా రు. తాండూరు సీఐని మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు  గోపిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ క్షమా పణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు