‘రైతుబంధు’తో వ్యవసాయ విప్లవం

8 Jul, 2022 00:39 IST|Sakshi

అన్నదాతకు భరోసా కల్పించిన పథకం ఇప్పటివరకు రూ.58 వేల కోట్ల్ల పంపిణీ   

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు ప్రపంచ వ్యవసాయ రంగంలో ఒక విప్లవం అని, ఈ పథకం రైతులకు బతుకుపై భరోసా కల్పించిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న పలు రైతు కేంద్రీకృత నిర్ణయాలతో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయిందన్నారు. ఈ మేరకు ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

వివరాలు ఆయన మాటల్లోనే... ‘వానాకాలం, యాసంగి సీజన్‌కు ముందు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయంగా రైతులకు ప్రభుత్వం రైతుబంధు అందజేస్తుంది. ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇస్తుంది. ఇప్పటివరకు తొమ్మిది సీజన్లలో రూ.58 వేల కోట్లను రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఐదు ఎకరాల్లోపు 56.43 లక్షల మంది రైతులకు రూ.4,801 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి.

గతంలో ఏ కారణంగానైనా రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడేది. ఇప్పుడు రైతు బీమాతో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తున్నాం. ఇప్పటివరకు 83,471 కుటుంబాలకు రూ.4,173 కోట్లను ప్రభుత్వం అందించింది.  రూ. 572 కోట్ల వ్యయంతో 2,601 క్లస్టర్లలో రైతు వేదికలను ని­ర్మించాం. వీటి నిర్వహణ­కు నెలకు రూ. 9 వేలు ఇ­స్తున్నాం’ అని వివరించారు.  

బడ్జెట్లో రూ. 30 వేల కోట్లు... 
మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి గోసను తీర్చారు. ప్రభు­త్వం బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 30 వేల కోట్లు కేటాయించింది. ఉచిత విద్యుత్‌ చెల్లించే రూ. 10 వేల కోట్లు ఇందుకు అదనం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో పండిన ధాన్యం 24 లక్షల టన్నులు మాత్రమే. అదే గతేడాది ఏకంగా 1.41 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. రైతులు వరితోపాటు ఇతర పంటల సాగుపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ప్రభు­త్వం తరఫున పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.    

మరిన్ని వార్తలు