మా మంచి ఎమ్మెల్సీనే: కరోనా కిట్‌తో విస్కీ మందు

18 Jun, 2021 03:39 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : లీడరా.. మజాకా! ఈ ఎమ్మెల్సీ రూటే సెపరేటు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం చేస్తున్నారు కదా! అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి కిట్‌బ్యాగులను పంపించారు. అయితే ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌.

మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీ, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పంపిణీ చేశారు. మెడికల్‌ కిట్లు అనగానే శానిటైజర్, మాస్కులు, పల్స్‌ ఆక్సీమీటర్‌.. మహా అయితే డ్రైఫ్రూట్స్‌ ఉంటాయని అంతా భావించారు. కానీ, ఆ ప్యాక్‌ తెరిచి చూసినవారు అవాక్కయ్యారు. ఎందుకంటారా?! పైన చెప్పినవే కాకుండా ఆ ప్యాక్‌లో టీచర్స్‌ విస్కీ బాటిల్‌ కూడా ఉంది మరి! దీంతో ప్యాక్‌ తీసుకున్న వారందరూ ‘మా మంచి లీడర్‌’ అంటూ మురిసిపోతూ ఇళ్లకు బయలుదేరారు.   

మరిన్ని వార్తలు