తెలంగాణ పోలీస్‌పై కీరవాణి అదిరిపోయే పాట

31 Oct, 2020 18:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరపరచి, ఆలపించిన ‘పోలీస్, పోలీస్ ...తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్’  అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో శనివారం ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కీరవాణి విచ్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి  31వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్బోచితంగా ఉందన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. ‘మనం కష్టపడుతూ సేలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని’ డీజీపీ అన్నారు.

కీరవాణి మాట్లాడుతూ, మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.  తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఇచ్చానని తెలిపారు. ‘ఇస్తున్నా ప్రాణం మీ కోసం’  పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వరపరచి పాడానని గుర్తు చేసుకున్నారు. ఈ పాటను హిందీలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా