భారీ శబ్ధాలతో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

30 Sep, 2022 09:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద శబ్దంతో కదులుతున్న ఎంఎంటీఎస్‌ రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనన్న అయోమయంతో క్షణాల్లో రైలు దిగి బయటకు వచ్చేశారు. భారీ కుదుపుతో అకస్మాత్తుగా రైలు ఆగిపోయిన సమయంలో స్పీడ్‌ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం ఉదయం 8.20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వైపు (నాంపల్లి) వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు బేగంపేట దాటింది.
చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు

హుస్సేన్‌సాగర్‌ జంక్షన్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ కుదుపునకు గురై రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఏం జరిగిందో అర్ధంకాక ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. రైలుకు విద్యుత్‌ సరఫరా జరిగే పాథన్‌పై చెట్టుకొమ్మ పడడంతో సరఫరా నిలిచినట్లు సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో రైలు స్పీడ్‌ తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది.15 నిమిషాల్లో సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా రైలు ముందుకుకదిలింది. చెట్టుకొమ్మ పడడంతోనే సరఫరా నిలిచి రైలు నిలిచిపోయినట్లు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ భవానీ శంకర్‌ సరస్వత్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు