సెల్‌ఫోన్‌ దెబ్బ..‘టైం’ బాగలేదు!

17 Jun, 2021 08:25 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, కనగల్‌(నల్లగొండ) : సెల్‌ఫోన్‌ విప్లవంతో గడియారం టైం బాగోలేక విలవిల్లాడుతోంది. సెల్‌ఫోన్‌లోనే టైం చూపుతున్నందున ప్రజలు గడియారాలను వాడడం మానేస్తున్నారు. ఒకప్పుడు చేతికి వాచీ ఉంటే స్టేటస్‌ సింబల్‌.. ఇప్పడు చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే అదే ప్రపంచం. ఇలా కాలానుగుణంగా మారుతున్న లోకం పోకడలకు ఎన్నో వస్తువులు కనుమరుగువుతున్నాయి. అందులో మణికట్టు మణిహారం చేతిగడియారం ఒకటి. ఒకప్పుడు పెళ్లి కొడుకుకు గడియారం, సైకిల్, రేడియోను ఆడపెళ్లివారు పెట్టేవారు. అది ఎంతో గొప్పగా భావించేవారు. గడియారం పెట్టకపోతే పెళ్లిలు ఆగిన ఘటనలు ఉన్నాయి. ఇలా శతాబ్దాలుగా మనిషితో పెనవేసుకున్న గడియారం బంధాన్ని సెల్‌ఫోన్‌ తెంచేస్తోంది.

మణిహారం చేతి గడియారం..
కొన్నేళ్ల క్రితం వరకు మణికట్టుకు మణిహారంగా చేతిగడియారం వెలిగిపోయేది. చేతికి గడియారం ఉంటే అదో స్టేటస్‌ సింబల్‌. గడియారంపై మమకారంతో ఇప్పటికీ కొందరు సీనియర్‌ సిటిజన్స్‌ చేతిగడియారాలను వాడుతున్నారు. మొబైల్‌ ఫోన్‌ రాకతో గడియారం స్థితిగతులు మారిపోయాయి. సెల్‌ఫోన్‌లోనే సమయంతోపాటు తేదీ నెల, సంవత్సరం చూపిస్తున్నందున ప్రజలు గడియారానికి ప్రత్యామ్నాయంగా మొబైల్‌ ఫోన్‌ను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ప్రతి వీధిలో గడియారాల షాపు ఉండేది. రంగురంగుల డిజైన్‌లతో షాపు నిండా గోడ గడియారాలు, చేతి గడియారాలు, టేబుల్‌ గడియారాలు ఉండేవి. గడియారాల విక్రయాలు, రిపేర్లతో ఎంతోమంది ఉపాధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. గడియారం దుకాణాలు గిరాకీ లేక మూతపడ్డాయి. దీంతో దుకాణదారులకు ఉపాధి కరువైంది.

మూతపడుతున్న దుకాణాలు
సెల్‌ఫోన్‌ దెబ్బకు గడియారంతోపాటు ఇతర ఉపకరణాలు సైతం కనుమరుగవుతున్నాయి. రంగుల లోకాలను ఒక్క క్లిక్‌తో ఫొటో ఫ్రేమ్‌లో బంధించే కెమెరా, మనసుకు హాయినిచ్చే పాటలు వినిపించే టేప్‌రికార్డర్, రేడియో, చీకట్లో దారిచూపే టార్చిలైట్, ఎంతటి లెక్కనైనా క్షణాల్లో చేసే క్యాలకులేటర్‌.. ఇలా ఎన్నో ఉపకరణాలను సెల్‌ఫోన్‌ మింగేసింది. మొబైల్‌లోనే ఫొటోలు దిగడం ఎవరికి పంపాలనుకుంటే వారికి క్షణాల్లో పంపుతున్నందున పనిలేక ఫోటో స్టూడియోలు మూతపడుతున్నాయి. కెమెరాకు క్రేజీ తగ్గడంతో ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు జీవనోపాధిని కోల్పోయారు.  

మరిన్ని వార్తలు