ఖమ్మం నగరంలో మోడల్‌ ‘వైకుంఠధామం’

30 Mar, 2021 11:03 IST|Sakshi
మున్నేటి కాలువ ఒడ్డున వైకుంఠధామం

రాష్ట్రంలో మోడల్‌ శ్మశానవాటికలుగా ఆధునీకరణ

సాక్షి, ఖమ్మం: పేరుకు అది మరుభూమే కానీ.. అన్ని హంగులతో ‘మనిషి చివరి మజిలీ’ యాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా రూపుదిద్దుకుంది. ఖమ్మం నగరంలోని హిందూ శ్మశానవాటిక (వైకుంఠధామం) ఆధునిక సొబగులద్దుకుంది. రాష్ట్రంలోనే మోడల్‌గా నిలుస్తోన్న ఈ ధామాన్ని త్వరలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 

మున్నేటి ఒడ్డున ఒకటి.. బల్లేపల్లిలో మరొకటి
ఖమ్మం నగరానికి సమీపాన మున్నేరు సమీపంలో కాలువ ఒడ్డున నిజాం కాలం నుంచీ దహన, ఖనన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటికేడాది జనాభా పెరగడంతో పట్టణం.. నగరంగా మారింది. దీంతో ఈ శ్మశానవాటికలో వసతులు లేక అంతిమయాత్ర నిర్వహించే వారికి ఇబ్బందులు తప్పట్లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత కార్యక్రమాల్లో భాగంగా శ్మశానవాటికలను వైకుంఠధామాల పేరుతో ప్రభుత్వం నిర్మిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో వీటికి స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని ఈ వైకుంఠధామాన్ని రూ.2 కోట్లతో ఆధునీకరించారు.

3.5 ఎకరాల్లోని ఈ వైకుంఠధామానికి స్వాగత ద్వారం ఐటీ హబ్‌ ఆర్చ్‌ని తలపిస్తోంది. ఐదు దహన వాటికలు, అంత్యక్రియలకు వచ్చిన వారు కూర్చునేందుకు వెయిటింగ్‌ గ్యాలరీ, కేశఖండన, సాన్నాల గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌తో పాటు వైకుంఠధామంలో 20 అడుగులతో ఏర్పాటుచేసిన శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి తెచ్చిన అందమైన పూల మొక్కలు వైకుంఠధామం చుట్టూ నాటారు. అలాగే, ఖమ్మం నగరం పరిధిలోని బల్లేపల్లిలో నాలుగెకరాల విస్తీర్ణంలో మరో వైకుంఠధామాన్ని నిర్మించారు. గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ వాటికలోనూ ఆధునిక హంగులతో పాటు 20 అడుగుల శివుని విగ్రహాన్ని పెట్టారు.

అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు