రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు 

20 Aug, 2022 01:24 IST|Sakshi

ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం  

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం.. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారి.. అనంతరం ఆరుగంటల తర్వాత బలపడి తీవ్ర వాయుగుండంగా మార్పు చెందింది.

ఇది శనివారం ఉదయం కల్లా తీరం దాటే అవకాశంఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది.

అప్రమత్తంగా ఉండాలి.. 
ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈక్రమంలో అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వరదలతో కలిగే నష్టాన్ని ముందస్తుగా అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది.

నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో ప్రారంభం కాగా... జూలై నుంచి రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదైంది. కేవలం రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. ఈక్రమంలో జూలై ఆఖరు నాటికే రాష్ట్రంలో సీజన్‌ సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత నైరుతి సీజన్‌లో ఈనెల 19 నాటికి 51.5 సెం.మీ. వర్షపాతంనమోదు కావాల్సిఉండగా, 83.23 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 62 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.

మరిన్ని వార్తలు