63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్‌

8 Nov, 2022 08:29 IST|Sakshi
సైక్లింగ్‌తో పాటు పర్వతారోహణ, మోటార్‌ బైకింగ్‌.. రన్నింగ్‌లోనూ మేజర్‌ జనరల్‌ డాక్టర్‌ ఏవీకే మోహన్‌ ప్రతిభ

ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్‌ స్పీడ్‌తో సైకిల్‌ తొక్కుతూ  రయ్‌ రయ్‌ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్‌ స్పీడ్‌ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్‌ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ డాక్టర్‌ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్‌. సోమవారం హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్‌ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి 
పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే...    

సాక్షి, సిద్దిపేట:  మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్‌ పూ­ర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిల­టరీ హాస్పిటల్‌లో డాక్టర్‌గా జాబ్‌ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధు­లు నిర్వర్తించి ఆర్మీ సదరన్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ పుణేలో మెడికల్‌ హెడ్‌గా మేజర్‌ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకు­న్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌­లో నివా­సం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న  డెంటల్‌ స్పెషలిస్ట్‌ గౌహతిలో ప్రాక్టీస్‌ చేస్తోంది. 

పర్వతారోహణ...బైకింగ్‌:
1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్‌ సతోపంత్‌కు పర్వతా­రో­హణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాం­గో­లోని మౌంట్‌ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే.  ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్‌ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్‌లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్‌ బైకింగ్‌ చేశాను.

సైక్లింగ్‌ అంటే ఇష్టంతో:
నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్‌ చేయడం అంటే చాలా  ఇష్టం. డిసెంబర్‌ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్‌ గ్రూప్‌ అయిన చెన్నై జాయ్‌ రైడర్జ్‌ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ,  టూర్‌ ఆఫ్‌ నీలగిరీస్‌ సైక్లింగ్‌ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్‌ చేశాను. జలశక్తి మిషన్‌ కింద 2019లో కచ్‌(గుజరాత్‌) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేశాను.

ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్‌ క్వాడ్రీలెట్రల్‌ 
ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్‌ క్వాడ్రీలెట్రల్‌ సైక్లింగ్‌ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్‌ చేస్తాను. ఫిట్‌నెస్‌ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. 

(చదవం‍డి: గిన్నిస్‌ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!)

మరిన్ని వార్తలు