గుడిసెలేని ఊరు.. మోహినికుంట

5 Apr, 2021 11:17 IST|Sakshi

మోహినికుంట ఆదర్శంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 

నెరవేరిన సొంతింటి కల 

 సకల సౌకర్యాల కేసీఆర్‌ నగర్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ప్రతీ మనిషికి సొం తిల్లు ఓ కల.. జీవితాంతం కష్టపడి సంపాందించినా ఇల్లు కట్టుకోలేని పేదలు అనేకమంది ఉన్నారు. పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు.. ఆకాశన్నంటే భూములు ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతిం టి కలను అందని ద్రాక్షగానే మిగుల్చుతోంది. అయితే సీఎం కేసీఆర్‌ పేదలకు ఇచ్చిన డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్ల హామీ ప్రస్తుతం నిరుపేదల్లో ఆనందం నింపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా  మోహినికుంట గ్రామం ఇప్పుడు గుడిసెలు, రేకుల ఇళ్లు లేని ఊరుగా రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తోంది. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్ల పథకం కింద ఇక్కడి సామాన్యులు ఆత్మగౌరవంతో జీవించే హక్కును అందుకున్నారు. మోహినికుంటలో కేసీఆర్‌ నగర్‌ పేరిట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో 65 డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించారు. మంత్రి కేటీఆర్‌ శనివారం వాటిని అర్హులైన పేదలకు కేటాయించారు. లబ్దిదారులంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలతో గృహప్రవేశాలు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సొంతింటికి రాకముందు, వచ్చాక లబ్ధిదారుల అనుభూతులు వారి మాటల్లోనే..

నెత్తిమీద సామాన్లు పెట్టుకుని ఊరంతా తిరిగినం
ఏనిమిదేండ్లు కిరాయి ఇంట్ల ఉన్నం. నేను కోళ్లవ్యాన్‌ డ్రైవర్‌ను. నా భార్య బీడీలు చేత్తది. ఇద్దరు కొడుకులు. మోహినికుంటలనే నా పెండ్లి అయ్యింది. అప్పటి సంది కిరాయి ఇంట్లనే ఉంటున్నం. ఏడాదికొక ఇల్లు మారేటోళ్లం. గప్పుడు నెత్తిమీద సామాన్లు పెట్టు కుని ఊరంతా తిరిగేటోళ్లం. మస్తు బాధ అనిపిస్తుండేది. ఇల్లు కట్టుకునే స్థోమతలేదు. గింత జాగలేదు. మా బాధలు ఎట్ల తీరుతయి దేవుడా అనుకునేటోళ్లం. కారం మెతుకులు తిన్నాసరేగానీ సొంత ఇల్లు ఉండాలే అనుకున్నం. నాలాంటి డ్రైవర్‌ ఇల్లు ఎట్ల కడుతడు. జీవితమంతా గిదే బతుకనుకున్నం. కానీ, కేటీఆర్‌ సార్‌ మాకు ఈడ ఇల్లు ఇప్పించిండ్రు. ఇప్పుడు మస్తు ధైర్యం వచి్చంది. పిల్లలను మంచిగా చదివించుకోవాలే అని డిసైడ్‌ అయినం. కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం. 
– మహ్మద్‌ రజాక్, కౌసర్‌బేగం

పెండ్లి చేసుకునుడే..
కిరాయి ఇంట్ల ఉంటున్నమని పిల్లను ఇచ్చేతందుకు సంబంధాలు వస్తలేవు. నేను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిజేస్తున్న. కిరాయి ఇంట్ల ఉంటే ఎవరూ విలువ గూడ ఇస్తలేరు. కనీసం మనిషిగా గుర్తిస్తలేరు. డ్రైవర్‌ పనిజేసేవాళ్లకు పిల్లను ఎవరు ఇస్తరు. మా ఇబ్బందులు గిట్లున్నయి. మా సర్పంచ్‌ డబుల్‌బెడ్రూమ్‌ ఇప్పించిండ్రు. అమ్మానాన్న నాకు పెళ్లి సంబంధాలు జూస్తున్నరు. సొంతింట్లకు అచ్చి నం. ఇగ పెండ్లి చేసుకునుడే.     
– శేఖర్‌

కిరాయి ఇంట్ల నుంచి డబుల్‌బెడ్రూమ్‌ ఇంట్లకు..
మా ఊరులో సొంతిల్లు లేదు. చాలా అవస్థలు పడ్డం. కూలి పనులు జేసుకునే మాకు సొంతిల్లు కట్టుకునే పరిస్థితి వస్తదోరాదో అనుకున్నం. కిరాయి ఇంట్లనే ఏండ్లకొద్దీ ఉన్నం. నెలకు రూ.500 కిరాయి. ఇప్పుడు డబుల్‌బెడ్రూమ్‌ ఇల్లు మంజూరైంది. కేటీఆర్‌ సార్‌ మా ఇంట్లకు వచ్చి గృహప్రవేశం జేసిండ్రు. గాయిన జేసిన సాయం మరిచిపోలేం.  
– గునుకంటి పావని

(చదవండి: మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు