మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ వ్యవహారంలో ట్విస్టులు.. ఓవైపు టీ సర్కార్‌కు నోటీసులు.. మరోవైపు నిందితుల అరెస్ట్‌

29 Oct, 2022 14:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో మరో మలుపు తిరిగింది. బీజేపీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన మరో బెంచ్‌ ఈ మేరకు కీలక తీర్పును వెల్లడించింది. రిట్‌ పిటిషన్‌ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులుగా ఉన్న ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది.  వచ్చే నెల(నవంబర్‌) 4వ తేదీ వరకు గడువు విధిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్‌ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు..

ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు కేసులో విచారణ వాయిదా వేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. దర్యాప్తుపై స్టే విధించింది. అయితే అంతకుముందు హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ ఆధారంగా.. రిమాండ్‌కు అనుమతించిన విషయం తెలిసిందే.

నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని.. లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలని, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని సైబరాబాద్‌ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఏసీబీ కోర్టుకు వీళ్లను తరలించినట్లు తెలుస్తోంది.

రెండు ధర్మాసనాలు వేర్వేరు తీర్పులివ్వడం.. ఒక బెంచ్‌ రిమాండ్‌కు తీసుకోవాలని ఆదేశిస్తే.. మరో బెంచ్‌ విచారణ వాయిదా వేయాలని ఆదేశించడం.. ఈలోపే సైబరాబాద్‌ పోలీసుల దూకుడుతో ఏం జరగనుందో అనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు