‘సమత’ ఘటనకు ఏడాది

24 Nov, 2020 09:11 IST|Sakshi

రాష్ట్రంలో సంచలనం రేపిన దారుణం

సాక్షి, మంచిర్యాల: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమతపై హత్యాచార ఘటనకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం (24 నవంబర్‌ 2019) ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ శివారులో షేక్‌బాబు, షేక్‌ ముగ్దుమ్, షేక్‌ శాబోద్దిన్‌ తాగిన మైకంలో సమతపై దారుణానికి ఒడిగట్టారు. ఏజెన్సీలోని పలు గ్రామాల్లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవించే సమత (30)పై అత్యాచారానికి పాల్పడడంతోపాటు శరీరభాగాలపై తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. సమత భర్త ఫిర్యాదు మేరకు  376డీ, 404, 312 3(2) (5) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద లింగాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

అదే సమయంలో సమతకు న్యాయం చేయాలని దళిత, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదిలాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసింది. నెల వ్యవధిలోనే అప్పటి ఎస్పీ మల్లారెడ్డి పర్యవేక్షణ, డీఎస్పీ సత్యనారాయణ, జైనూర్‌ సీఐ, లింగాపూర్‌ ఎస్సై విచారణ వేగవంతంగా పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు పకడ్బందీగా ఉండడంతో ఈ ఏడాది జనవరి 30న ఆదిలాబాద్‌ స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   

మరిన్ని వార్తలు