ఇల్లు పీకి పందిరేసి! హైదరాబాద్‌లో బెంబేలెత్తిస్తున్న కోతులు

17 Apr, 2022 15:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్టుకునే సిబ్బంది లేక ఇబ్బందులు

టెండర్లు పిలిచినా కొరవడిన స్పందన

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈస్ట్‌ మారేడ్‌పల్లి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పద్మారావునగర్, సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్, తార్నాక, అమీర్‌పేట, కాప్రా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తున్న కోతులతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భయంతో వణికిపోతున్నారు. జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగంలో కుక్కలను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం ఉన్న కారి్మకులున్నప్పటికీ, కోతులను పట్టుకునేందుకు నైపుణ్యం ఉన్న సిబ్బంది లేదు.

దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఫిర్యాదుల ధాటికి తట్టుకోలేక  సంప్రదాయ విధానాలతోనే, తమకు తెలిసిన పద్ధతిలోనే  ఏటా అయిదారు కోతులకు మించి పట్టుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలే తమ పాట్లేవో తాము పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోతులను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం, సామగ్రి కలిగిన ఏజెన్సీలను ఆహా్వనిస్తూ టెండర్లు పిలిచారు.

►  గ్రేటర్‌ పరిధిలోని ఆరు జోన్లకుగాను కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ జోన్లకు మాత్రం ఒక్కో టెండరు దాఖలైనట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, చారి్మనార్‌ జోన్లకు ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక రీటెండర్లకు సిద్ధమయ్యారు. అయినా కాంట్రాక్టు ఏజెన్సీలు వస్తాయో, లేదో  తెలియని పరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీలో పనులు చేసేందుకు ఇటీవలి కాలంలో కాంట్రాక్టర్ల నుంచి తగిన స్పందన కనిపించడం లేదు. ఓవైపు పెరుగుతున్న ఎండలతోపాటు మరోవైపు అడవుల్లోనూ ఆహారం దొరక్క, నగరానికి చేరుతున్న  కోతులు ఇళ్లలో చొరబడుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలు కోతుల ఆవాసాలుగా ఉన్నాయి. నగరంలో వేల సంఖ్యలో ఉన్న కోతులు  బహిరంగ ప్రదేశాల్లోనూ బీభత్సం సృష్టిస్తున్నాయి.
►   ఢిల్లీ తదితర  మెట్రో నగరాల్లో కోతులను పట్టుకునే నైపుణ్యమున్న ఏజెన్సీలకు ఒక్కో కోతికి  రూ.5వేల నుంచి  రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ గరిష్టంగా రూ.1800 చెల్లించేందుకు  మాత్రమే టెండర్లు ఆహ్వానించింది. ఈ ధర కోతులను పట్టుకోవడం వరకే కాదు.. వాటిని తిరిగి ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని అటవీప్రాంతంలో విడిచి పెట్టి రావాలి.  ఆమేరకు, సంబంధిత అటవీశాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి.
► ఈ పనులతోపాటు కోతులను తరలించేందుకయ్యే రవాణా ఖర్చులు  కూడా కాంట్రాక్టు ఏజెన్సీవే. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ ప్రజల  నుంచి ఫిర్యాదులకనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పిన ప్రాంతాలకు వెళ్లి కోతుల్ని పట్టుకోవాలి.
► కోతుల్ని పట్టుకున్నాక, వాటిని సంబంధిత అటవీ ప్రాంతంలో వదిలేంతవరకు వాటికి ఎలాంటి గాయాలు కాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని అవస్థలున్నందున కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడంలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కోతి చేష్టలు ఇలా..
►  తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరుతున్నాయి. గదుల్లోని సామగ్రిని చిందరవందర చేస్తున్నాయి.
►  కోతులు వంట గదుల్లోని పప్పులు, చక్కెర తదితర డబ్బాలను పడవేస్తున్నాయి. దేవాలయాల వద్ద కొబ్బరిచిప్పలు, అరటిపండ్ల వంటి వాటికోసం పైకి ఎగబడుతున్నాయి. వీటిని చూసి భయంతో కిందపడి గాయాలపాలైన ఘటనలున్నాయి.
► ఇళ్లలోకి ప్రవేశించిన కోతులతో జడుసుకొని పరుగుపెట్టి పడిపోయి దెబ్బలు తగిలిన వారున్నారు. పార్కుల్లో, రోడ్ల పక్కన పాదచారులపైకి లంఘిస్తూ, రక్కిన ఘటనలు కూడా ఉన్నాయి.
► కోతులు వాటికి నచి్చన వాటిని నోట పట్టుకెళ్తూ, మిగతా వాటిని ఇల్లంతా వెదజల్లుతున్నాయని పద్మారావునగర్‌కు చెందిన శ్రీవల్లి చెప్పారు. అవి బయటకు వెళ్లేవరకూ బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.

కోతుల బారినుంచి కాపాడాలి
అమీర్‌పేట డివిజన్‌ శివ్‌బాగ్‌లో కోతులు బెడద ఎక్కువగా ఉంది. పగటి పూట ఎక్కడి నుంచో గుంపులు గుంపులుగా వచ్చి హాస్టళ్ల ముందు సంచరిస్తున్నాయి. ఒంటరిగా వచ్చే వారి వెంటపడుతున్నాయి. చేతిలో ఏది ఉంటే  అది ఎత్తుకుపోతున్నాయి.  – గౌతమ్, అమీర్‌పేట

మీదపడి కరుస్తున్నాయి..
కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు భయంతో వణికిపొతున్నారు. రోడ్లపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మీదపడి దాడి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీద పడి కరుస్తున్నాయి. – కె. అనిత, పద్మారావునగర్‌

ఆహార పదార్థాలను చిందరవందర చేస్తున్నాయి..
చిలకలగూడ, సీతాఫల్‌మండి, నామాలగుండు, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్న వానరాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. ఇళ్లలోకి చొరబడి నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను చెల్లాచెదురు చేసి, దొరికిన వస్తువులను విసిరి కొట్టి, పూలమొక్కలు, కుండీలు ధ్వంసం చేస్తున్నాయి. గట్టిగా అదిలిస్తే మీదపడి గోళ్లతో గీరుతున్నాయి. పళ్లతో కొరికి గాయాలు చేస్తున్నాయి. సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదు.  – మార్పెల్లి రవి, చిలకలగూడ

మరిన్ని వార్తలు