తిండి కోసం కోతి తిప్పలు

22 Mar, 2021 10:45 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ: ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మూగజీవులకు అటవీ ప్రాంతంలో ఆహారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగడానికి నీరు లేక, పండ్లు ఫలాలు లేక మూగజీవులు రోడ్లపైకి వస్తున్నాయి.  బాన్సువాడ–గాంధారిల మధ్య దట్టమైన అడవులు ఉండగా, ప్రస్తుతం ఆకులన్నీ రాలిపోయి, చెట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో ఈ అడవిలో ఉన్న వానరాలన్నీ నిత్యం కామారెడ్డి–బాన్సువాడ రోడ్డుపైనే కనిపిస్తున్నాయి.

రహదారి వెంబడి వెళ్లే వారెవరైనా ఆహార వస్తువులను, పండ్లు ఫలాలను పడేస్తేనే తింటాయి. అలాగే ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమవడంతో రైతులు రోడ్డుపై పంట నూర్పిళ్లను చేస్తున్నారు. నూర్పిళ్లు చేసిన పంటను  రైతులు ఇంటికి తీసుకుపోతుండగా,  రోడ్డు పక్క పడిన గింజలను తింటున్నాయి. అటవీ ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడంతో మూగజీవాలకు నిలువ నీడ లేకుండా పోయింది. బాన్సువాడ–నిజామాబాద్, బాన్సువాడ–కామారెడ్డి రోడ్లపై  ఇరువైపులా ఉన్నమర్రి చెట్లపై వానరులు నివాసముంటూ, నిత్యం ఆహారం కోసం పడరాని పాట్లు పడడం గమనార్హం. 

స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వానరాలకు ఆహారం 
ఇదిలాఉండగా, గత ఏడాది వానరాలు పడుతున్న పాట్లను చూసి చలించిన బాన్సువాడలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  ప్రతి ఆదివారం ప్రత్యేకంగా పండ్లు, ఫలాలను వానరాలకు అందజేశారు. ప్రత్యేక ఆటోల్లో వీరు పండ్లను తీసుకెళ్ళి వాటికి వేశారు. నీటి ప్యాకెట్లను సైతం అందజేశారు. వారాంతపు సంతలో కుళ్లిపోయిన కూరగాయలు, వృథాగా ఉన్న కూరగాయలను సైతం అడవులకు తరలించి వానరాలకు అందజేసే విధంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలి.

చదవండి: ఉయ్యాలపై వృద్దుడి స్టంట్‌.. నెటిజన్లు ఫిదా!

మరిన్ని వార్తలు