60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్‌.. అయోమయంలో అధికారులు, మిల్లర్లు

4 Oct, 2022 09:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎంఆర్‌ గడువు ముగిసి మూడు రోజులైనా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. యాసంగి సీఎంఆర్‌కు సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న గడువును నెలరోజులపాటు పొడిగించిన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. వానకాలం సీఎంఆర్‌ గురించి ఊసెత్తలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అయోమయంలో పడిపోయారు.

60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్‌ 
వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ ఇప్పటివరకు 60 శాతమే పూర్తయింది. వానాకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 70.22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్‌ కింద 47 ఎల్‌ఎంటీ మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు 30 ఎల్‌ఎంటీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు సమాచారం. అంటే 60 శాతం సీఎంఆర్‌ మాత్రమే పూర్తయింది. మిగతా సీఎంఆర్‌తో పాటు యాసంగి సీఎంఆర్‌ పూర్తి చేసేందుకు మరో నెల గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

అయితే కేంద్రం మాత్రం కేవలం యాసంగి సీఎంఆర్‌కు సంబంధించిన గడువును మాత్రం అక్టోబర్‌ 31 వరకు పెంచుతూ గతనెల 27న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో ముగిసిన వానకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ గురించి ప్రస్తావించలేదు.  

గత కొంతకాలంగా సీఎంఆర్‌ ఆలస్యం
ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సీఎంఆర్‌ అప్పగించడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిల్లింగ్‌లో అవకతకవలు, పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహించిన ఎఫ్‌సీఐ.. జూన్‌ 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు సీఎంఆర్‌ తీసుకోలేదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

జూలై నెలాఖరు నుంచి మిల్లింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా మిల్లుల్లో ధాన్యం తడిసిపోవడం, మిల్లులు నిలిచిపోయినప్పుడు కూలీలు, హమాలీలు సొంతూర్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో మిల్లింగ్‌ జరగలేదు. దీంతో సెప్టెంబర్‌ నెలాఖరు వరకు 60 శాతమే సీఎంఆర్‌ పూర్తయింది. 

ఈ విషయమై మంత్రి కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ గత నెల చివరివారంలో సమావేశమై సీఎంఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం ఇతర రాష్ట్రాలకు పంపాలని 
కూడా నిర్ణయించి, ఎఫ్‌సీఐ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్‌ వేగం పెరిగింది. కానీ సెపె్టంబర్‌ 30 తరువాత గడువు పొడిగించకపోవడంతో వానకాలం సీఎంఆర్‌పై నీలినీడలు కమ్ముకున్నట్లయింది.
చదవండి: మునుగోడు దంగల్‌: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ

మరిన్ని వార్తలు