అనధికార లే అవుట్లు..16 వేలు!

22 Sep, 2021 03:06 IST|Sakshi

రాష్ట్రంలో మొత్తం 20 వేలకు పైగా లే అవుట్లు 

ఇందులో అనుమతి ఉన్నవి 3,568 మాత్రమే 

దాదాపు 80 వేల ఎకరాల్లో అనధికారికంగా ప్లాట్ల విక్రయాలు 

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం పెండింగ్‌లో 25 లక్షలకు పైగా దరఖాస్తులు 

నిబంధనల మేరకు క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి ఆదాయం.. ప్రజలకు ఉపశమనం 

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న అనధికార లే అవుట్లలో ప్లాట్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. రాష్ట్రంలో 20 వేలకు పైగా లేఅవుట్లుండగా, అందులో కేవలం 3,568కి మాత్రమే పూర్తిస్థాయిలో అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన దాదాపు 16 వేలకు పైగా లే అవుట్లలో కొన్నిటికి అరకొరగా అనుమతులుండగా, మరికొన్నిటికి అసలు అనుమతులే లేవు.

అయినప్పటికీ ఆయా లే అవుట్లలోని ప్లాట్లను ప్రజలకు రియల్‌ వ్యాపారులు అమ్మేస్తున్నారు. ఈ లే అవుట్లు 1.22 లక్షలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉంటే, అందులో 40 వేల ఎకరాల వరకే అనుమతులున్నాయని, మిగిలిన 80 వేలకు పైగా ఎకరాల్లో అమ్మకాలు జరుపుతున్న ప్లాట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేవని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థలు, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ)ల నుంచి అనుమతులు లేకుండా తయారు చేస్తున్న ఈ అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొంటున్న సామాన్యులు ఆ తర్వాత ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోంది.

ఇలాంటివెన్నోఉదంతాలు వెలుగులోనికి వచ్చినా రియల్‌ వ్యాపారులను నియంత్రించలేని కారణంగా ఫలితం లేకుండా పోతోందనే విమర్శలున్నాయి. తాజాగా ఇప్పుడు రాష్ట్రంలోని ఇండ్ల స్థలాల విషయంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉపసంఘం ఎజెండాలో ప్లాట్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అనధికారిక లే అవుట్ల అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. 

ఎల్‌ఆర్‌ఎస్‌ ఏమవుతుందో? 
ఉపసంఘం ఎజెండాలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించకపోయినా దీనిపైన కూడా నిర్ణయం వెలువడే అవకాశముందని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 లక్షలకు పైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఇప్పటికే శాఖాపరమైన కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది.

ఈ నివేదికలను కూడా ఉపసంఘం పరిశీలించే అవకాశం ఉంది. కోర్టు తుది తీర్పునకు లోబడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గ్రామకంఠం భూములపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామపంచాయతీలకు చెందిన భూముల్లో ఏవైనా ఆక్రమణలు ఉంటే వాటిని కూడా ఉపసంఘం పరిశీలిస్తుందనే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఈ అనధికారిక లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు, గ్రామకంఠం భూములను క్రమబద్ధీకరిస్తే.. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారికి ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉంది.  

కేటీఆర్‌ నేతృత్వంలో ఉప సంఘం 
రాష్ట్రంలోని ఇండ్ల స్థలాల సంబంధిత సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ మంత్రి కె. తారకరామారావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మంత్రులు టి. హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు సభ్యులుగా వ్యవహరించనున్నా రు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అనధికారిక లే అవుట్లు.. ప్లాట్లు, ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠాలతో పాటు ఇతర అంశాలపై కమిటీ పరిశీలన జరుపుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు