కోవిడ్‌ వేళ పుత్తడి బొమ్మలకు పుస్తెల తాళ్లు

3 Oct, 2020 08:58 IST|Sakshi

ఒక్క నెలలోనే 67 బాల్యవివాహాలను నిలిపేసిన చైల్డ్‌లైన్‌

గత ఆరు నెలల్లో 250కి పైగా బాల్యవివాహాలు

సాక్షి, హైదరాబాద్ : పుత్తడిబొమ్మకు పుట్టెడు కష్టాలు. చిన్నారి మెడలో పుస్తెలతాడు. బడి, కాలేజీ బాట పట్టాల్సిన ఆమె పెళ్లికూతురై పెళ్లిపందిరికి వెళ్తోంది. మేడ్చల్‌ సమీపంలోని కండ్లకోయకు చెందిన ఆ అమ్మాయి పేరు దివ్య (పేరు మార్చాం). నిండా పదిహేనేళ్లు కూడా లేవు. చదువంటే ఆమెకు ప్రాణం. అయితే, కోవిడ్‌ ఆమె పాలిట శాపంగా మారింది. 6 నెలలుగా స్కూల్స్‌ లేక ఇంటిపట్టునే ఉంటున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ‘భారంగా’ కనిపించింది. కోవిడ్‌ నేపథ్యంలో ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని ఆందోళన కొద్దీ బంధువుల అబ్బాయితో పెళ్లికి ఏర్పాట్లు పూర్తిచేశారు. అధికారులు, షీటీమ్స్‌ చొరవతో ఆ చిన్నారి పెళ్లి కూతురుకు విముక్తి లభించింది. అయితే  ఈ బాల్య‌వివాహాలు ఒక్క కండ్లకోయలో మాత్రమే కాదు, నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఎంతోమంది చిన్నారి పెళ్లికూతుళ్లుగా మారుతున్నారు. 

పోలీసులు, అధికారులకు  స‌మాచారం తెలిసిన చోట మాత్రమే బాల్యవివాహాలు ఆగిపోతున్నాయి. చాలాచోట్ల గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూనే ఉన్నాయి. ఒక్క సెప్టెంబర్ నెల‌లోనే ఐదు బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు మేడ్చల్‌ జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి ఒకరు తెలిపారు.  ‘కట్టుదిట్టమైన లాక్‌డౌన్, కోవిడ్‌ ఉధృతంగా కొనసాగుతున్న ఏప్రిల్‌లోనే హైదరాబాద్‌ చుట్టుపక్కల 67 పెళ్లిళ్లను అడ్డుకోగలిగాం’ అని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పద్మావతి పేర్కొన్నారు.  కరోనా సోకితే తమ కుటుంబం ఏమైపోతుందనే బాధ చాలామందిని వెంటాడుతోంది. బతికుండగానే బాధ్యతలను తీర్చుకోవాలని  తమ కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తున్నామ‌ని కొంద‌రు వివ‌రించారు.  కోవిడ్ స‌మ‌యంలో  గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రత్యేకించి శివార్లలో సుమారు 250కి పైగా పెళ్లిళ్లను అధికారులు నిలిపేశారు.

మరిన్ని వార్తలు