మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్‌’!

17 Jan, 2021 08:16 IST|Sakshi

అఖిలప్రియకు ‘అనుచరుల్ని’ ఏర్పాటు చేసిన సిద్ధార్థ్‌ 

ఆ పరిచయం నేపథ్యంలోనే తాజా కిడ్నాప్‌నకు సహకారం

15 మందిని అరెస్టు చేసిన బోయిన్‌పల్లి పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో 15 మంది నిందితుల్ని బోయిన్‌పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీంతో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. వీరంతా కిడ్నాప్‌ జరిగిన రోజు ప్రవీణ్‌రావు ఇంటికి ఆదాయపు పన్ను అధికారులుగా వెళ్లిన వారే అని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. గుంటూరు శ్రీనుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వీరిని విజయవాడకు చెందిన సిద్ధార్థ్‌ పంపాడని, అతడినీ అరెస్టు చేశామని పోలీసులు పేర్కొంటున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అఖిలప్రియ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆమె హైదరాబాద్, బెంగళూరులో ఉండేవారు. అమరావతికి వెళ్లిన ప్రతిసారీ తన వెంట మందీమార్బలం ఉండాలని కోరుకునేది. విజయవాడ, అమరావతి ఆ చుట్టుపక్కల అఖిలప్రియ పర్యటన ఉన్నప్పుడల్లా ‘జన సమీకరణ’చేసే బాధ్యతల్ని శ్రీను నిర్వర్తించేవాడు. ఇతడికి విజయవాడలోని ఓ మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీ నిర్వహించే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రతి దఫా దాదాపు 20 మంది ఆమె వెంట ఉండేలా చూశారు. అప్పట్లో ఒక్కొక్కరికీ రోజుకు రూ.1,000 చొప్పున చెల్లించేవారు.

ఐటీ అధికారులుగా తర్ఫీదు.. 
తాజాగా బోయిన్‌పల్లి కిడ్నాప్‌నకు కుట్ర పన్నిన అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌.. ఆదాయపుపన్ను అధికారులుగా నటించడానికి అద్దెకు బౌన్సర్లను ఏర్పాటు చేయమని శ్రీను ద్వారా సిద్ధార్థ్‌కు తెలిపారు. రూ.50 వేలు అడ్వాన్సుగా ఇచ్చి.. విషయం సెటిల్‌ అయిన తర్వాత భారీ మొత్తం ఇస్తానంటూ శ్రీను హామీ ఇచ్చాడు. దీంతో విజయవాడలోని వివిధ కాలనీలకు చెందిన దాదాపు 20మంది యువకుల్ని కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్‌ హోటల్‌కు పంపాడు. వీరికి యూసుఫ్‌గూడలోని ఎంజీ ఎం స్కూల్‌ వద్ద ఐటీ అధికారులు, పోలీసులుగా నడుచుకోవడంపై భార్గవ్‌రామ్‌ తర్ఫీదు ఇచ్చాడు. కిడ్నాప్‌ పూర్తి కాగానే కొందరు, బాధితుల్ని విడిచిపెట్టిన తర్వాత మరికొందరు విజయవాడకు వెళ్లిపోయారు. దర్యాప్తులో ఈ విషయాలను గుర్తించిన పోలీసులు శనివారం సిద్ధార్థ్‌ సహా 15 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 11న అరెస్టయిన అఖిలప్రియ పీఏ బోయ సంపత్‌కుమార్, భార్గవ్‌రామ్‌ వ్యక్తిగత సహాయకుడు నాగరదొడ్డి మల్లికార్జున్‌రెడ్డి, డ్రైవర్‌ డోర్లు బాల చెన్నయ్యలను కస్టడీలోకి తీసుకోవాలని బోయిన్‌పల్లి అధికారులు నిర్ణయించారు. పరారీలో ఉన్న భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు