నేషనల్‌ హైవేలుకాదు..లోకల్‌ రోడ్లే డేంజర్‌!

14 May, 2023 03:39 IST|Sakshi

స్థానిక రోడ్లపైనే ఎక్కువ ప్రమాదాలు.. గతేడాది గ్రామీణప్రాంతాల్లో 4,684 మంది మృతి

హెల్మెట్‌ వాడకపోవడం, సీటుబెల్ట్‌ పెట్టుకోకపోవడమూ మరో కారణం

సాక్షి, హైదరాబాద్‌ : విశాలంగా ఉండే జాతీయ రహదారులు.. వేగంగా దూసుకెళ్లే వాహనాలు... దీంతో అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని అనుకోవడం సహజం. కానీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్ర రహదారులే యమ డేంజర్‌ అని పోలీస్‌ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జాతీయ రహదా రుల్లో ప్రయాణంతో పోలిస్తే వాహనదారులు స్థానిక రోడ్లపై నడిపేటప్పుడు అంత్యంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలుస్తోంది. పక్క ఊరికే కదా వెళ్లేది.. పది కిలోమీటర్ల దూరానికే హెల్మెట్‌ ఎందుకు? ఊర్లో కూడా హెల్మెట్‌ పెట్టుకుని తిరగాలా? కారులో సీటు బెల్ట్‌ పెట్టుకోకున్నా అడిగేదెవరు..? అన్న ధీమాతో వెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నట్టు వెల్లడవుతోంది. 

నిర్లక్ష్యమే మృత్యుపాశం.. 
వాహనదారుల నిర్లక్ష్యమే వారి పాలిట మృత్యువై వెంటాడుతోంది. జాతీయ రహదారులతో పోలిస్తే.. స్థానిక రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం రోడ్డు భద్రత నియమాలను లెక్క చేయడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతులు ద్విచక్రవాహనదారులే ఉంటున్నారు.

అయితే వీరిలో ఎక్కువ మంది హెల్మెట్‌ ధరించకపోవడం.. హెల్మెట్‌ పెట్టుకున్నా.. దాన్ని సరిగా లాక్‌ చేయకపోవడం మరణాలకు ప్రధాన కారణాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దూరం ఎంతైనా సరే.. తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా కారులో సీటుబెల్ట్, ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ వాడకం తప్పక అలవాటు చేసుకోవాలని చెపుతున్నారు. 

పట్టణ, గ్రామీణప్రాంతాల వారీగా 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు.. 
పట్టణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు  - 12203
మృతుల సంఖ్య - 2873 

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 9416 
మృతుల సంఖ్య - 4684

రాష్ట్రంలో 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య ఇలా..

మరిన్ని వార్తలు