Cyber Crimes: సైబర్‌ వలలో టెకీలు... బాధితులంతా ఐటీ ఉద్యోగులే

13 Mar, 2022 08:42 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ యువతి మాదాపూర్‌లోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్‌ నంబర్‌ను వాట్సాప్, టెలిగ్రాం ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌లలో యాడ్‌ చేశారు. ఆ గ్రూప్‌లో అడ్వైజర్‌ ఆదిత్య సంతోష్‌ ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని సూచించాడు.

దీంతో సదరు 39 ఏళ్ల టెకీ.. నెల రోజుల వ్యవధిలో రూ.2.2 లక్షల పెట్టుబడి పెట్టింది. యాప్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ రూ.5.8 లక్షలని చూపిస్తుండటంతో ఆనందానికి గురైంది. కానీ, ఆ సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం లేదని తెలుసుకున్న టెకీ.. తాను మోసపోయానని గ్రహించింది. దీంతో గత నెలాఖరున సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. 

  • ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని సూచించడంతో వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. 25 లేదా 35 రోజుల లాకిన్‌ పీరియడ్‌ తర్వాతే విత్‌డ్రాకు అవకాశముంటుందనే షరతును పట్టించుకోలేదు. దశల వారీగా రూ.10.2 లక్షల పెట్టుబడులు పెట్టాడు. కానీ, లాగిన్‌ పీరియడ్‌ పూర్తయ్యాక.. సంబంధిత వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి సదరు టెకీని తొలగించేశారు, గ్రూప్‌నూ డిలీట్‌ చేసేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకొని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
  • హఫీజ్‌పేటకు చెందిన 22 ఏళ్ల ఓ మహిళా ఇంజినీర్‌.. ఐడీబీఐ పాస్‌బుక్‌ అప్‌డేట్‌ చేయడం కోసం బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను గూగుల్‌లో వెతికింది. వెంటనే బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ సౌరవ్‌ శర్మ నుంచి తనకు ఫోన్‌ వచ్చింది. పాస్‌బుక్‌ను అప్‌డేట్‌ చేయడానికి మీ సెల్‌ఫోన్‌లో ఎనీ డెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని సూచించడంతో.. సరేనని ఇన్‌స్టాల్‌ చేయగా క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.1.68 లక్షలు మాయమైపోయాయి.  
  • .. ఇలా ఒకరిద్దరు కాదు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్న వారిలో ఐటీ ఉద్యోగులు, టెకీ గ్రాడ్యుయెట్లే ఎక్కువగా ఉన్నారు. అత్యాశే బాధితుల కొంప ముంచుతోంది. తక్కువ టైంలో రెట్టింపు లాభాలను పొందొచ్చనే వల విసిరి నట్టేట ముంచేస్తున్నారు సైబర్‌ నేరస్తులు. 

80 శాతం ఐటీ బాధితులే.. 
కస్టమర్‌ కేర్, ఓఎల్‌ఎక్స్, ఓటీపీ, క్రెడిట్‌ కార్డ్, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్‌ ఇలా రకరకాలుగా సైబర్‌ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. గత నెలలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌లో 70 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. ఇందులో 80 శాతం బాధితులు ఐటీ నేపథ్యం ఉన్న వారే ఉండటం గమనార్హం. విద్యావంతులు సైబర్‌ మోసాల బారిన పడరన్నది అపోహ మాత్రమే.

నిజం చెప్పాలంటే నిరుద్యోగులు, నిరక్షరాస్యుల కంటే వీరిని మోసం చేయడమే సులువేమో. మోసపూరిత స్కీమ్‌లలో పెట్టుబడులు, ఎనీ డెస్క్‌ వంటి రిమోట్‌ యాక్సెస్‌ను ఇచ్చే నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం లేదా వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వంటి రహస్య వివరాలను బహిర్గతం చేయడం వంటి సైబర్‌ నేరాల బారిన పడటానికి ప్రధాన కారణం.  

అవగాహనతోనే అడ్డుకట్ట.. 
సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్‌ నేరాలు 200 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా సైబర్‌ నేరాల బారిన పడుతున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వటమే సైబర్‌ నేరాలకు ప్రధాన కారణం. అవగాహనే సైబర్‌ నేరాల నివారణకు మందు. 
 – స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ 

(చదవండి: కాలుతూ.. పేలుతూ..)

మరిన్ని వార్తలు