తెలంగాణ బడ్జెట్‌కు వేళాయే..

7 Mar, 2021 02:46 IST|Sakshi

ఈ నెల 15 నుంచి బడ్జెట్‌ సమావేశాలు!

రెండు వారాలు నిర్వహించే యోచన

18న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఈ నెల 14న పోలింగ్‌ జరగనుంది. ఆ మరునాడే బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలిరోజున గవర్నర్‌ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా వేస్తారు. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించి.. ఎప్పటివరకు సమావేశాలు జరపాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

16న సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడనుంది. 17న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ, సమాధానం ఒకేరోజు పూర్తి చేసి.. 18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో బడ్జెట్‌పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలోనే సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్టు తెలిసింది. బడ్జెట్‌ సమావేశాల తేదీలపై అధికారంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మార్చి మధ్యలో నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ లెక్కన ఈ నెల 14 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీగా ఉంటున్నందున ఆ తర్వాతే సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని పద్దులపై సుదీర్ఘంగా చర్చలు కాకుండా స్వల్ప వ్యవధిలోనే ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. సమావేశాల్లోనూ కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు