ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి

22 Apr, 2021 03:31 IST|Sakshi

పెద్దపల్లి రూరల్‌: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండుప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దేవగూడకు చెందిన ఎతిరాజు స్వామి కుటుంబం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడింది. స్వామికి «జూలపల్లి మండలం అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన మమత (27) తో వివాహం జరిగింది. వీరికి శివకృష్ణ (3), శ్రీకృతి (14 నెలలు) సంతానం. స్వామి తోబుట్టువు పద్మ భర్త చనిపోవడంతో ఆమె వీరి వద్దే ఉంటోంది.

ఆడపడుచు పద్మతో స్వామి భార్య మమతకు తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం స్వామి కూలిపనికి వెళ్లిన తర్వాత ఏదో విషయమై ఆడపడుచుతో గొడవపడ్డ మమత తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వామి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాపిల్లలు కనపడక పోవడంతో పద్మను అడగ్గా తనకు తెలియదని చెప్పింది. తర్వాత అత్తింటివారిని, బంధువులను ఫోన్‌ ద్వారా అడిగి తెలుసుకోగా, తమ వద్దకు రాలేదని చెప్పారు. బుధవారం ఉదయం వారిని వెతికేందుకు బయల్దేరేలోగా మృతదేహాలు సమీపంలోని బావిలో తేలాయని తెలియడంతో హతాశులయ్యారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ రవీందర్, ఏసీపీ నితికపంత్, సీఐ ప్రదీప్‌.. సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికి తీయించారు. కాగా, తమ కూతురు అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మమత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు