కొడుకు చెంతకు చేర్చిన వాట్సాప్‌

4 Apr, 2022 23:13 IST|Sakshi
తల్లి కాళ్లపై పడి రోదిస్తుండగా కన్నీళ్లు పెట్టుకుంటున్న కొడుకు

హైదరాబాద్‌లో తప్పిపోయిన కోరుకొండపల్లి వాసి

చేరదీసి వాట్సాప్‌ గ్రూపుల్లో అడ్రస్‌ షేర్‌ చేసిన సామాజిక కార్యకర్త 

9రోజుల అనంతరం కొడుకును కలిసిన తల్లి

కేసముద్రం: హైదరాబాద్‌లోని ఓ కోళ్లఫామ్‌లో పనిచేస్తున్న కొడుకు వద్ద ఉంటున్న తల్లి 9 రోజుల క్రితం తప్పిపోయింది. ఓ సామాజిక కార్యకర్త ఆమెను చేరదీసి అడ్రస్‌ను వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేయడంతో సమాచారం కేసముద్రానికి చేరింది. తల్లి ఆచూకీ తెలుసుకున్న కొడుకు ఆమె వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మాంకాల యాకయ్య కొంతకాలంగా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధి గండిచెరువులో గల కోళ్లఫామ్‌లో పనిచేస్తున్నాడు. కొడుకు వద్దే ఉంటున్న తల్లి కొమురమ్మ 9 రోజుల క్రితం బస్సు ఎక్కి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.


తల్లి, కొడుకుతో జంగయ్య

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి ఆదివారం చేరుకున్న కొమురమ్మ, తన పరిస్థితిని పలువురుకి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త చెరుకూరి జంగయ్య ఆమె పూర్తి వివరాలను అడిగితెలుసుకున్నాడు. ఆకలితో ఉన్న కొమురమ్మకు భోజనం పెట్టాడు. ఆమె తెలిపిన వివరాలను వెంటనే వాట్సాప్, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ సమాచారం తిరిగితిరిగి కేసముద్రం గ్రూపులకు చేరింది. దీంతో సమీప బంధువులు కొమురమ్మ వివరాలను కొడుకు యాకయ్యకు ఫోన్‌ ద్వారా తెలిపారు.

వెంటనే అతడు తల్లి ఉన్నచోటుకు చేరుకున్నాడు. తప్పిపోయిన తల్లిని 9రోజుల తర్వాత చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె సైతం కొడుకును చూసి భావోధ్వేగానికి గురైంది. తన తల్లిని చేరదీసిన జంగయ్యకు యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు. వాట్పాప్‌ ద్వారా సమాచారం షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే తల్లీకొడుకులు కలుసుకోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు