హైదరాబాద్‌ రాకపోకలకు ‘హైవే’ కష్టాలు

15 Oct, 2020 02:11 IST|Sakshi

భారీ వర్షంతో ఆయా రహదారులన్నీ జలమయం

గగన్‌పహాడ్‌ వద్ద దెబ్బతిన్న బెంగళూరు జాతీయ రహదారి 

వరంగల్‌ హైవేపై తప్పని ట్రాఫిక్‌ మళ్లింపులు 

మనోహరాబాద్‌ అండర్‌పాస్‌ జలదిగ్బంధం  

నాగపూర్‌ హైవే వాహనదారులకు ఇబ్బందులు

ఇతర హైవేలపైనా తప్పని తిప్పలు 

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో కురిసిన భారీ వర్షం హైవే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగించింది. వివిధ జాతీయ రహదారులపై నగరానికి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ హైవేలపై పలుచోట్ల వరద ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌ చేరుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కొన్ని చోట్ల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వచ్చేలా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉంటూ వెళ్లిన పరిస్థితి కనబడింది.  

ఎక్కడెక్కడ ఎలా అంటే... 
జాతీయ రహదారి 44 (బెంగళూరు హైవే) అరాంఘర్‌–శంషాబాద్‌ మార్గం గగన్‌ పహాడ్‌లోని అప్పా చెరువు కట్ట తెగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలైతే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గగన్‌ పహాడ్‌ అండర్‌పాస్‌ రహదారి సగం వరకు కొట్టుకుపోయిందన్న సమాచారంతో.. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.  
వరంగల్‌ హైవేలోని ఉప్పల్‌ నల్లచెరువు కట్ట తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాచకొండ పోలీసులు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలను ఘట్‌కేసర్‌ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్‌ నుంచి సికింద్రాబాద్‌వైపు మళ్లించారు. అలాగే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లే వాహనాలను నాగోల్, బండ్లగూడ మీదుగా ఓఆర్‌ఆర్‌ ద్వారా ఘట్‌కేసర్‌వైపు మళ్లించారు.  
నాగపూర్‌ హైవే మార్గంలోనూ వాహన రాకపోకలకు తిప్పలు తప్పలేదు. భారీ వర్షంతో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ వద్ద పనులు జరుగుతున్న అండర్‌పాస్‌ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనాలను తూప్రాన్, నాచారం, గజ్వేల్, ములుగు, కిష్టాపూర్‌ మీదుగా మేడ్చల్‌ చెక్‌పోస్టుకు మళ్లించారు. తిరుగు ప్రయాణంలోనే అదే మార్గంలో వాహనాలను అనుమతించారు.  
అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెడ్డికుంట చెరువు తెగి.. విజయవాడ హైవే మార్గంలోని ఇమామ్‌గూడ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు అక్కడ మరమ్మతులు చేసి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూశారు.  
శ్రీశైలం హైవేలోనూ రహదారులపై వరద నీరు ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నింపాదిగా కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగిలిన జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ వరద వల్ల వెతలు తప్పలేవు.  

రాజధానిలోనూ తిప్పలు... 
భారీ వర్షం వల్ల హైదరాబాద్‌ రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు ట్రాఫిక్‌ ఫ్లైఓవర్‌ ఎక్కకుండా సెవెన్‌ టూంబ్స్‌ రోడ్డు మీదుగా వెళ్లాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలు షేక్‌పేట, సెన్సార్‌ వల్లీ, ఫిల్మ్‌నగర్, బీవీబీ జంక్షన్‌ , బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 మీదుగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పురానాపూల్‌ 100 ఫీట్‌ రోడ్డు, మలక్‌పేట ఆర్‌యూబీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లారు. అలాగే శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను అనుమతించకపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  

మరిన్ని వార్తలు