మెతుకుసీమలో మూషిక జింకలు

27 Oct, 2020 08:00 IST|Sakshi

పోచారం అభయారణ్యంలో పునరుత్పత్తి కేంద్రం

కిన్నెరసాని, చిల్కూరు, నెహ్రూ పార్కు తర్వాత ఇక్కడే ఏర్పాటు

పెరగనున్న పర్యాటకుల సందడి

సాక్షి, మెదక్‌: అరుదైన జీవ జాతుల్లో మూషిక జింక ఒక్కటి. ప్రభుత్వం వీటి మనుగడకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటి పునరుత్పత్తికి అభయారణ్యాల పరిధిలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్‌ జిల్లాలోని పోచారం అభయారణ్యంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మెదక్‌ జిల్లాకు 15 కిలోమీటర్లు.. హైదరాబాద్‌కు 115 కి.మీల దూరంలో ఉన్న పోచారం అభయారణ్యంలో అందమైన సరస్సుతో పాటు అపారమైన జంతు, వృక్ష జాతులు ఉన్నాయి. 1989లో ఈ అభయారణ్యం పరిధిలోని పర్యావరణ పర్యాటక కేంద్రంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. మొత్తం 158 హెక్టార్ల అటవీ స్థలాన్ని రెండు బ్లాక్‌లుగా విభజించారు. 124 హెక్టార్లలో ఒక బ్లాక్, 34 హెక్టార్లలో మరో బ్లాక్‌గా ఏర్పాటు చేసి జింకల సంరక్షణ చేపట్టారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం చుక్కల దుప్పులు 350 నుంచి 450, మనుబోతులు 8 నుంచి 10, సాంబార్‌ దుప్పులు సైతం 8 నుంచి 10, కొండ గొర్రెలు 12 వరకు ఉన్నాయని జిల్లా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: పత్తిపై ‘గులాబీ’ పంజా)

చిల్కూరు, నెహ్రూ పార్కు తర్వాత ఇక్కడే.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని డీర్‌ పార్కులో మూషిక జింక సంతతి పెంపునకు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన ప్రయోగం ఫలించింది. మూడేళ్ల క్రితం నాలుగు మూషిక జింకలను ఆ పార్కులో వదలగా.. గత ఏడాది ఓ మూషిక జింక పురుడు పోసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వీటి పునరుత్పత్తికి చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ సమీపంలోని చిల్కూరు మృగవాణి నేషనల్‌ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ రెండు మగ, ఆరు ఆడ మూషిక జింకలను వదిలారు. 

ఆ తర్వాత నెహ్రూ జూపార్క్‌లో రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను వదిలి.. పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించారు. అదేవిధంగా మెదక్‌ జిల్లాలోని పోచారంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలో మూషిక జింకలను వదిలేందుకు రంగం సిద్ధమైంది. రూ.5 లక్షల వ్యయంతో ఎన్‌క్లోజర్‌ నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. కాగా, జిల్లా అటవీ శాఖ అధికారిణి పద్మజారాణిని సంప్రదించగా.. ఎన్‌క్లోజర్‌ నిర్మాణం పూర్తయిన వెంటనే మూషిక జింకలు వస్తాయని తెలిపారు. పర్యాటకులు, సందర్శకుల సౌకర్యార్థం కేంద్రం లోపల ప్రత్యేక వాహనంలో తిరిగేలా 4.5 కి.మీల మేర మట్టి ట్రాక్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి మేరకే వాహనాల్లో వెళ్లి చూడొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు