ముస్లిం జనాభా పెరగడం లేదు..

10 Oct, 2022 02:11 IST|Sakshi

సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది: అసదుద్దీన్‌ ఒవైసీ

కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే!

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్ధితి దారుణంగా ఉంది

హిందూ రాష్ట్రమనే కలలు జాతీయవాదానికి వ్యతిరేకం

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను దేశభక్తులనడం సరికాదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ‘‘దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదు. పెరుగుదల రేటు తగ్గుతోంది. బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం గరిష్టంగా ఉండేందుకు కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే..’’ అని ఆలిండియా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం రాత్రి హైదరాబాద్‌ దారుస్సలాం మైదానంలో జరిగిన రహ్మతుల్‌ లిల్‌ ఆలమీన్‌ సభలో ఆయన ప్రసంగించారు. జనాభా నియంత్రణ విషయమై ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్‌ తప్పుపట్టారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గిందన్న విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ముస్లింల జనాభా పెరుగుతోందని అనవసరంగా ఆరోపణలు చేయవద్దన్నారు.

వారి తీరు జాతీయ వాదానికి వ్యతిరేకం
బీజేపీ హిందూ దేశం కలలు స్వాతంత్య్ర భారతానికి, జాతీయవాదానికి వ్యతిరే­కమని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని, బహిరంగ జైళ్లలో జీవిస్తున్నట్టుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధికుక్కలకు దక్కిన గౌరవం కూడా ముస్లింలకు దక్కడం లేదన్నారు. గుజరాత్‌లో దాండియా కార్యక్రమంపై రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ పోలీసులు తొమ్మిది మందిని స్తంభానికి కట్టేసి కొరడాలతో కొట్టారని.. పోలీసులు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకుంటే కోర్టులు ఎందుకు మూసివేయాలని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మౌనం వహించడం విచారకరమని పేర్కొన్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను దేశభక్తులుగా అభివర్ణించడం సరికాదని విమర్శించారు. మిలాద్‌ సందర్భంగా పోలీసులు పెట్రోల్‌ బంకులు మూసివేయడం ఏమిటని, మిగతా పండుగలకు అలా ఎందుకు మూసివేయరని ప్రశ్నించారు.

టిప్పు వారసత్వాన్ని తుడిచిపెట్టలేరు
బెంగళూరు–మైసూర్‌ టిప్పు ఎక్స్‌­ప్రెస్‌ రైలు పేరును వడయార్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడాన్ని అసదుద్దీన్‌ తప్పుపట్టారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా టిప్పుసుల్తాన్‌ పోరాడారని, అది బీజేపీకి రుచించలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో టిప్పు వారసత్వాన్ని తుడిచి వేయడం బీజేపీకి ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.  

మరిన్ని వార్తలు