విచారణ రికార్డ్‌ చేయాలని ఆదేశించండి: ఎంపీ అవినాశ్‌రెడ్డి పిటిషన్‌

10 Mar, 2023 10:56 IST|Sakshi

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌

సీబీఐ విచారణ ప్రక్రియపై సందేహాలున్నాయి

నేను కోరినా విచారణ ప్రక్రియను సీబీఐ రికార్డ్‌ చేయలేదు

దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగేలా చూడండి 

పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరిన అవినాశ్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం  విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు తాను సహకరిస్తున్నప్పటికీ విచారణ అధికారి సరైన విధానాలు అనుసరించడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

‘నన్ను మొదటిసారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగనివి కూడా చిలువలు పలువులు చేస్తూ దుష్ప్రచారం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూర్వకంగా కోరాను. రెండోసారి విచారణకు పిలిచినప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను, విచారణ అధికారి రామ్‌సింగ్‌ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

 నేడు విచారణ  
అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేసులు విచారించే బెంచ్‌కు పంపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌. కె.లక్ష్మణ్‌ బెంచ్‌ శుక్రవారం విచారించనుంది.   

చదవండి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ ఏడుపు

మరిన్ని వార్తలు