బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం 

5 Dec, 2020 08:19 IST|Sakshi

నల్లగొండ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని చూస్తే, టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్యులర్‌ పార్టీ కాంగ్రెస్సే అని, గెలుపు ఓటములన్నది సహజమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నేతలు అమిత్‌ షా, యోగి తదితర నేతలు హైదరాబాద్‌కు వచ్చి మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బులు వెదజల్లిందని ఆరోపించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మత ప్రాతిపదికన తరహాలో జరిగాయని ఆరోపించారు. దుబ్బాకలో కూడా ఇదే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్‌ బలహీనపడ లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. కేంద్ర వి«ధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, అలాంటి ఉద్యమాలే రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు