30 ఏళ్ల క్రితం భార్య, పిల్లలతో కొండగట్టుకు సీఎం కేసీఆర్.. ఎంపీ సంతోష్‌ ట్వీట్‌ వైరల్‌

16 Feb, 2023 12:02 IST|Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కొండగట్టుకు వెళ్లిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌.. తమ చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం పెద్దనాన్న కేసీఆర్‌, సోదరి కల్వకుంట్ల కవిత, పెద్దమ్మ శోభ, తల్లిదండ్రులు రవీందర్‌రావు, శశికళతో కలిసి కొండగట్టుపై దిగిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

‘ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది. సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులతో కలిసి అనేకసార్లు కొండగట్టు అంజనేయస్వామిని దర్శనం చేసుకున్నాం. కొండగట్టు వ్యూ పాయింట్‌ నుంచి అప్పటి అపురూప చిత్రాలు..’ అంటూ కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలు పోస్టు చేశారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.

కాగా సీఎం కేసీఆర్‌ బుధవారం కొండగట్టు అంజన్న ఆలయ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని, అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు