చిట్టి చేతులు.. పెద్ద చేతలు

6 Aug, 2021 10:55 IST|Sakshi

   మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో మొక్కలు కాపాడేందుకు పిల్లల వినూత్న ప్రయోగం

సాక్షి, మెదక్‌: హరితహారానికి మేముసైతం అంటున్నారు రేపటి పౌరులు. నాటిన మొక్కలు ఎండిపోకుండా మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటాకింద బస్తీ పిల్లలు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపరుస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు పడకపోవడంతో హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్‌కు డబ్బాకట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకూ నీళ్లు పోస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ డబ్బాను తయారుచేసి, దానికి పైపును బిగించి తమ సైకిల్‌కు కట్టారు. సమీపంలో ఉన్న కాలువ నుంచి నీటిని డబ్బాలోకి తోడి, సైకిల్‌ ద్వారా తరలించి మొక్కలకు నీరందిస్తున్నారు. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ప్రాణవాయువుతో పాటు నీడనూ ఇస్తాయని వారు చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్‌ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.  

ఎంపీ సంతోష్‌ అభినందనలు.. 
వెల్దుర్తి పిల్లల పర్యావరణ చైతన్యాన్ని గురించి తెలుసుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన పని చేస్తున్నారంటూ పిల్లలను అభినందిస్తూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు