ఆర్‌ఆర్‌ఆర్‌: రాజమౌళికి ఎంపీ వార్నింగ్‌

27 Oct, 2020 17:27 IST|Sakshi

జూనియర్‌  ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ఇటీవల అన్ని జాగ్రత్తలతో ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఈ నెల 22న కొమురం భీం జయంతి సందర్భంగా రామరాజు వాయిస్‌తో కూడిన ఎన్టీఆర్(కొమురం భీం) టీజర్‌ని చరణ్‌ విడుదల చేశారు. రామ్ చరణ్ వాయిస్‌తో ప్రారంభమైన వీడియోలో. గోండ్రు బెబ్బులి కొమురం భీంగా ఎన్టీఆర్ పాత్రల తీరుతెన్నులని పరిచయం చేశారు. చదవండి: వివాదంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌.. ఆ సన్నివేశాలు తొలగించండి

అయితే సినిమాలోని కొమురం భీం పాత్ర వివాదంగా మారుతోంది. కొమురం భీంగా నటిస్తున్న తారక్‌కు ఇందులో ముస్లిం టోపీ పెట్టడంపై ఆదీవాసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు. నిజాం వ్యకులతో పోరాటం చేసిన కొమరం భీమ్‌కు ఇతర మతాలతో సంబంధం పెట్టి టోపీలు పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా టోపీ ఉన్న సన్నివేశాలని తొలగించాలని, లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేసే అవకాశం ఉదని హెచ్చరించారు. కొమరం భీమ్ తమ పాలిట దేవుడని, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని అన్నారు. అంతేగానీ కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని అన్నారు. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌: రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌

మరిన్ని వార్తలు