నేను తెలుగు ప్రజల కజిన్‌ను‌: కేంద్ర మాజీ మంత్రి

5 Feb, 2021 17:13 IST|Sakshi

హైదరాబాద్‌: తాను తెలుగు ప్రజలకు కజిన్ అని.. ఇక్కడ నుంచి తనకు రాజ్యసభ సీటు లభించింది అని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌ ప్రభు గుర్తుచేసుకున్నారు. విశాఖ జోన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ప్రకటించామని, దీనిపై ఎంపీలు పరిశీలిస్తున్నారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ప్రజల పన్నులతోనే నడుస్తాయని అన్నారు. ప్రైవేటైజేషన్ అంటే షేర్ హోల్డర్స్‌కు మంచి లాభాలు ఇవ్వడానికేనని వివరించారు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని ప్రకటించారు. ప్రాణాలు అర్పించి కార్మాగారం తెచ్చారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన బీజేపీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశ చరిత్రలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చారిత్రాత్మకమని.. రెండంకెల వృద్ధి సాధ్యమని సురేశ్‌ ప్రభు తెలిపారు. బడ్జెట్ కరోనా కారణంగా వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. ఈయూ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపిందని చెప్పారు. వృద్ధి రేటు కూడా తగ్గిందని.. ఈ బడ్జెట్ కొత్త వేవ్ తీసుకుని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి వస్తుంది అని భావిస్తున్నట్లు తెలిపారు.

రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.16.57లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని వెల్లడించారు. సూక్ష్మ సేద్యం కోసం, ఈనామ్‌ ద్వారా మార్కెట్ సదుపాయాలు పెంచారని సురేష్‌ ప్రభు చెప్పుకొచ్చారు. రక్షణకు తాము మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే మార్కెట్ దేశంలో రైతులకు ఉపయోగమని, ప్రభుత్వం వారితో చర్చించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. రైతులకు తాము వ్యతిరేకం కాదని.. వారిని గౌరవిస్తామని సురేశ్‌ ప్రభు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు