Muddasani Kanakaiah: మూగబోయిన పోరాట గొంతుక 

24 May, 2021 08:47 IST|Sakshi
కనకయ్య(ఫైల్‌)  

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి, పలు రాజకీయ పార్టీల్లో తనదైన ముద్ర వేసిన ముద్దసాని కనకయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1970లో రాడికల్‌ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. తర్వాత కాంగ్రెస్, బీఎస్‌పీ, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో చురుకైన పాత్ర పోషించారు.

విద్యార్థి ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారు. నాడు దొరల, భూస్వాముల, గడీల పాలనకు చరమగీతం పాడేందుకు విద్యార్థి ఉద్యమాన్ని నడిపారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ మేయర్‌ డి.శంకర్, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ లాంటి  ప్రముఖులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా పని చేశారు.  

ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ సంతాపం.. 
ముద్దసాని కనకయ్య మృతి బాధాకరమని, ఎన్నో ఏళ్లు అనేక ఉద్యమాల్లో సహచరుడిగా ఉన్న ఆయన దూరమవ్వడం తాడిత, పీడిత ప్రజలకు తీరనిలోటని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌లు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు