నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్‌

10 Dec, 2021 04:46 IST|Sakshi

పంచాయతీ అనుమతులతో లే అవుట్లు, నిర్మించిన ఇళ్ల వివరాల సేకరణ

68 కొత్త మున్సిపాలిటీలు, 131 విలీన గ్రామాల్లో అనుమతుల తీరుపై విచారణ 

జీహెచ్‌ఎంసీ శివార్లలోని కొత్త పురపాలికల్లో భారీగా నిర్మాణాలు

వాటి క్రమబద్ధీకరణకు కొత్త విధివిధానాలు సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ  

సాక్షి, హైదరాబాద్‌: నయా మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ నజర్‌ పెట్టింది. పంచాయతీలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో సర్పంచ్, పాలకమండలితోపాటు కార్యదర్శులుగా వ్యవహరించినవారు ఇచ్చిన ‘అనుమతుల’తో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల దుండిగల్‌లో నకిలీ అనుమతితో సాగిన నిర్మాణం వెలుగులోకి రావడంతో పురపాలక శాఖ అప్రమత్తమైంది.

ఇటీవల ఏర్పాటైన 68 కొత్త మునిసిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన 131 గ్రామ పంచాయతీల్లో 2018 తర్వాత పాత తేదీల అనుమతితో వెలిసిన వెంచర్లు, నిర్మించిన భవనాలు, ఇళ్లు, తదితర కట్టడాల వివరాలను తెప్పించింది. ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌లపై కోర్టుల్లో వివాదాలున్న నేపథ్యంలో కొత్త విధానం ద్వారా అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేలా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించడం కష్టంగా మారడంతో న్యాయ పరమైన చిక్కులు రాకుండా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది.

కొత్త మున్సిపాలిటీల్లోనే ఈ కొత్తవిధానం వర్తించేలా రూపొందించాలని యోచి స్తున్నట్లు సమాచారం. ఏ సర్వే నంబర్‌లో ఏ స్థలానికి ఎప్పుడు అనుమతి మంజూరైంది? నిర్మాణం సాగిన వివరాలను కూడా ఇన్‌వార్డు, అవుట్‌వార్డుల్లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

జీహెచ్‌ఎంసీ శివార్లు, ఇతర పట్టణాల సమీపంలో...
గ్రేటర్‌ హైదరాబాద్‌ శివార్లన్నీ గతంలో గ్రామపంచాయతీలే. శివార్లలో గత 20 ఏళ్ల నుంచి వేల సంఖ్యలో లేఅవుట్లు వెలసి కాలనీలు ఏర్పాటయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016 నుంచి మళ్లీ శివారు పంచాయతీల్లో కొత్త వెంచర్లు, నిర్మాణాలు వచ్చాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన శివారు ప్రాంతాల్లోనూ పాత తేదీల ‘అనుమతి పత్రాల’తో కొత్త లేఅవుట్లు వెలిశాయి.

దీంతో ఐటీ కారిడార్‌ పరిధిలోని కిస్మత్‌పూర్, పీరంచెరువు, బైరాగిగూడ, కోకాపేట, గోపన్‌పల్లి, మణికొండ, పుప్పాల్‌గూడ, నార్సింగి, మంచిరేవుల, బండ్లగూడ, దుండిగల్, పోచారం ప్రాంతాలతో పాటు ఓఆర్‌ఆర్‌కు లోపలున్న స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. ఇక్కడ పాత లేఅవుట్ల ఆధారంగా అనుమతిపత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు జరిగి నట్లు, ఇంకా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

బోడుప్పల్, పిర్జాదిగూడ, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పే ట, జిల్లెలగూడ, జవహర్‌నగర్‌ కార్పొరేషన్లతో పాటు ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, కోకాపేట, పోచారం, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, శంషాబాద్, ఆదిబట్ల, నాగారం, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, కరీంనగర్‌లో కొత్తపల్లి, మహబూబ్‌నగర్‌లో భూత్పూరు మొదలైన మున్సిపాలిటీల్లో ఒక ఫ్లోర్‌ అనుమతితో రెండు మూడంతస్తుల భవనాలను నిర్మించి నట్లు, పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం లే అవుట్‌లో వదిలేసిన స్థలాలు కూడా ఆక్రమణలకు గురై భవనాలు వెలిసినట్లు పురపాలక శాఖ గుర్తించింది.   

మరిన్ని వార్తలు