అధికారుల ఓవరాక్షన్‌.. ఇంటి పన్న కట్టలేదని తలుపులు, కుర్చీలు తీసుకెళ్లి..

30 Mar, 2022 10:33 IST|Sakshi
తలుపును ఊడదీస్తున్న సిబ్బంది, టీవీని తీసుకెళ్తూ..

సాక్షి,మేడిపల్లి(హైదరాబాద్‌): ఇంటి పన్ను కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్‌ వీధి నంబరు–8లోని మురళి అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు.

సదరు ప్లాట్‌ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయమై ప్లాట్‌ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్‌ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్ట లేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ జిల్లా లీగల్‌ సెల్‌ చైర్మన్‌ వంగేటి ప్రభాకర్‌ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్‌ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

చర్యలు తీసుకుంటాం.. 
మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్‌ కలెక్టర్లు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 
– రామకృష్ణారావు, పీర్జాదిగూడ కమిషనర్‌

చదవండి: Hyderabad: డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్‌ పోలీస్‌ కొత్త ఐడియా


 


అధికారులు.. ఇదేం తీరు..!   

మరిన్ని వార్తలు