సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు..

5 Sep, 2020 10:24 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ రెండో సర్వసభ్య సమావేశానికి మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ సర్వసభ్య శనివారం నిర్వహించనున్నారు. గతంలో రెండు సార్లు సమావేశం జరిగినా వాటిలో ఒకటి మొదటి బడ్జెట్‌ అమోదం కోసం నిర్వహించగా, రెండోది కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం నిర్వహించారు. కోవిడ్‌–19 నేపథ్యంలో గత కొద్ది నెలలుగా సమావేశం నిర్వహించలేదు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు మేయర్‌ సునీల్‌రావు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. 

అభివృద్ధిపైనే ప్రధాన చర్చ.. 
నగరపాలక సంస్థ సమావేశంలో 60 డివిజన్లలో జరుగుతున్న, కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలను అధికారులు కార్పొరేటర్లు అందించారు. నగరంలో సుమారు రూ.70 కోట్ల విలువచేజే పనులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపేందుకు అజెండాలో చేర్చారు. వీటిలో చాలా వరకు ఆమోదం పొందనున్నాయి. హరితహారం, పట్టణప్రగతి కోసం సీఎం ప్రత్యేక నిధులు ఖర్చు చేసేందుకు సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. ఇంటిగ్రెటేడ్‌ కూరగాయాల మార్కెట్‌ కోసం రూ.14 కోట్లు, 35 ఓపెన్‌ జిమ్‌ల కోసం రూ.4 కోట్లు, శ్మశానవాటికల కోసం రూ.కోటి, మిగిలిపోయిన పార్క్‌ల అభివృద్ధికి రూ.4 కోట్లు, ఆధునిక టాయిలెట్ల నిర్మాణానిక రూ.2 కోట్లు, శివారు ప్రాంతాల తాగునీరు, డ్రెయినేజీ పనులకు రూ.5 కోట్లు, వివిధ డివిజన్లలో రూ.36 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, మున్సిపల్‌ భవనం ఆధునికీకరణ పనుల కోసం రూ.2 కోట్లతోపాటు అభివృద్ధి పనుల కోసం అయా డివిజన్ల కార్పొరేటర్లు ఇచ్చిన నివేదిక అధారంగా పలు పనులకు ఆమోదం తెలిపే అవకాశం     ఉంది.  

సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు..
మున్సిపల్‌ సర్వసభ్య సమావేశానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తమ అజెండాతో సమావేశానికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల కార్పొరేషన్‌ అధి కారులపై వచ్చిన ఆరోపణలు, అవినీతిపై నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ఆరోపణలు తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా పూర్తి వివరాలు సిద్ధం చేసుకుంది. అయితే అధికారులపై అవినీతి ఆరోపణలపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు