ప్లీనరీలో ‘మున్నూరు రవి’ కలకలం

28 Apr, 2022 08:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన మున్నూరు రవి టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరు కావడం కలకలం సృష్టించింది. వీవీఐపీలు ఉన్న ప్లీనరీలోకి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా, బార్‌కోడ్‌గల పాస్‌లు ఉన్న వారే ప్రవేశించగల సమావేశ మందిరంలోకి రవి రావడాన్ని భద్రతా లోపంగానే నేతలు భావిస్తున్నారు. ప్లీనరీకి 22 కేటగిరీల పార్టీ నేతలను ఆహ్వానించగా ఆ జాబితాలో లేనప్పటికీ రవి ఎలా హాజరయ్యాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీవీఐపీల బార్‌కోడ్‌ ఉన్న పాస్‌తోనే అతను లోపలికి వచ్చి ఉంటాడని, ఆ పాస్‌ ఎవరు ఇచ్చి ఉండొచ్చనే దానిపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

పార్టీ కార్యకర్తగా హాజరయ్యా: రవి 
ఈ విషయంపై మున్నూరు రవిని మీడియా సంప్రదించగా ‘కేసీఆర్‌ అభిమానిగా, పార్టీ కార్యకర్తగా సమావేశాలకు హాజరయ్యా, దీన్ని వివాదాస్పదం చేయడం తగదు. నేను బెయిల్‌పై ఉన్నా.. నేరస్తుడిని కాదు’అని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు