సోషల్‌మీడియాలోనూ ప్రచారం బంద్‌.. బల్క్‌ మెసేజ్‌లు పంపడం కూడా నిషేధం

2 Nov, 2022 02:31 IST|Sakshi
గోదాముల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఈఓ వికాస్‌రాజ్‌  

రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

నల్లగొండ, చండూరు: ఈ నెల 3న నిర్వహించే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో  ఆయన పర్యటించారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించాక.. చండూరు, కోటయ్యగూడెం పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. అనంతరం నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందని.. õసోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారాల్లో ప్రచారం చేయొద్దని, సైలెంట్‌ పీరియడ్‌ ప్రారంభమైన తర్వాత బల్క్‌ షార్ట్‌ మెసేజ్‌ సర్వీస్‌ ఫోన్‌ ద్వారా ఆటోమేటెడ్‌ క్యాంపెయిన్‌ చేయడం కూడా నిషేధించబడిందని ఆయన చెప్పారు. మోడల్‌ కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

నియోజకవర్గంలో బయటి వ్యక్తుల కదలికలను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించామని తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించి పంపిణీ కేంద్రం, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలీసు బందోబస్తును పరిశీలించి, ఉప ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు