గులాబీ వైపే మునుగోడు!

4 Nov, 2022 00:41 IST|Sakshi

ఉప ఎన్నిక ముందు సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నదిదే

గంపగుత్తగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు?

‘కారు’ వైపే బయటి ప్రాంతాల ఓటర్ల మొగ్గు

ఒకట్రెండు మండలాల్లోనే బీజేపీ నుంచి గట్టిపోటీ?

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నట్లు అన్ని సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ కూడా తమ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డిపై విజయం సాధిస్తారని పార్టీ అంచనా వేస్తోంది. 47 మంది అభ్యర్థులు రంగంలో ఉన్న ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ప్రధాన ప్రతిపక్షాలపై మొదట్నుంచీ తమదే పైచేయి అని టీఆర్‌ఎస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

నేతలకు కేసీఆర్, కేటీఆర్‌ ఫోన్లు
పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ సరళి, పార్టీ అభ్యర్థి సాధించే ఓట్ల శాతంపై పలు సంస్థలు, నిఘా వర్గాలతో పాటు పార్టీ యంత్రాంగం నుంచి అందిన నివేదికల ఆధా రంగా గెలుపుపై అధికార పార్టీ అంచ నాకు వచ్చింది. బూత్‌ల వారీ ఓటింగ్‌ సరళిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎప్పటి కప్పుడు ఆరా తీస్తూ క్షేత్రస్థాయి పరిస్థితు లపై నివేదికలు అంద జేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఉదయం నుంచే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులతో పలు దఫాలుగా ఫోన్‌లో మాట్లాడారు.

ఎక్కడెక్కడ ఏ విధంగా పోలింగ్‌ జరుగు తున్నదీ, పార్టీ అనుకూల వైఖరి అడిగి తెలుసు కున్నా రు. వివిధ పార్టీల ప్రలోభాల పర్వం ఎంతమేర ఓట రుపై ప్రభావం చూపిందనే కోణంలోనూ ఆరా తీసి నట్లు సమాచారం. ఒకటీ రెండు మండలాల్లోనే బీజేపీ నుంచి గట్టి పోటీ ఉందని, కాంగ్రెస్‌తో పెద్దగా ఇబ్బంది లేదనే అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఫలించిన ప్రచార వ్యూహం
ఉప ఎన్నికలో పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే విపక్ష పార్టీలపై పైచేయి సాధించగలిగామని టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడు తున్నారు. నియోజక వర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు 70 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లను మోహరించడం, ప్రతి వంద మంది ఓటర్లుకు ఒకరు చొప్పున పార్టీ నేతలను ఇన్‌చార్జిలను నియమించడం కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు.

మరోవైపు సామాజిక పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు గంప గుత్తగా టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారని, రైతుబంధు వంటి పథకాల లబ్ధి దారుల్లో మెజారిటీ ఓటర్లు తమ వైపే మొగ్గుచూపినట్లు టీఆర్‌ ఎస్‌ లెక్కలు వేసుకుంటోంది. మును గోడు నియోజకవర్గం బయట 40వేల ఓట్లు ఉండగా, ఇతర పార్టీలతో పోలిస్తే తామే వారిని ఎక్కువ సంఖ్యలో చేరుకో గలిగామని చెబుతోంది. గురువారం హైదరా బాద్, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి మునుగోడులోని స్వస్థలా లకు వచ్చిన ఓటర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా అధినేత కేసీఆర్‌కు ప్రచార ఇన్‌చార్జిలు నివేదించారు. 

కాంగ్రెస్, బీఎస్పీ సాధించే ఓట్లపైనా లెక్కలు
ఇదే సమయంలో ఏయే అంశాలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాయనే కోణంలో కూడా కేసీఆర్‌ ఆరా తీసినట్లు సమాచారం. మహిళా ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఎక్కువ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వారు ఎటు వైపు మొగ్గు చూపారనే కోణంలో వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించే పనిలో టీఆర్‌ఎస్‌ ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి సాధించే ఓట్లపైనే టీఆర్‌ఎస్‌ ఆధిక్యత ఆధారపడి ఉందని భావిస్తోంది. బీఎస్‌పీతో పాటు కేఏ పాల్‌ సాధించే ఓట్ల శాతంపైనా టీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది. 

మరిన్ని వార్తలు