కులాలకు గాలం.. ఏమడిగినా తగ్గేదేలా అంటున్న పార్టీలు

20 Oct, 2022 02:00 IST|Sakshi

మునుగోడులో కులాల వారీగా సమీకరణలు..

ప్రచారంలో అన్ని పార్టీలదీ అదే బాట

గుళ్లు కావాలా... పనులు కావాలా.. మీకేది కావాలంటే అది చేస్తామంటూ హామీ

సాక్షి, నల్లగొండ: చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో ఓ సామాజిక వర్గం ఓట్లకు ముఖ్యనాయకుడు ఒకరు బేరం పెట్టారు. మీ కులం ఓట్లన్నీ మాకే కావాలి.. మీకేం కావాలో చెప్పండి.. అని అడిగితే ఆ కులం వారు రూ.12 లక్షలు అడిగారు. అంతే.. వెంటనే రూ.2 లక్షలు ఇచ్చేశారు. మిగతా రూ.10 లక్షలు మంత్రి కోటాలో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మొత్తంతో గుడికి ప్రహరీ గోడ, లేదంటే కమ్యూనిటీ హాల్‌ నిర్మించుకోవాలని భావిస్తున్నారు.

►మునుగోడు మండలం కొరటికల్‌లో కంఠమహేశ్వరస్వామి గుడికి రూ.5 లక్షలు ఇస్తామని టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒప్పుకున్నారు. అందులో రూ.లక్ష మూడు రోజుల కిందట సోమవారమే ఇచ్చారు. మిగతా మొత్తాన్ని మరో వారంలో ఇస్తామని ఒప్పుకున్నారు.

►విరాళాల సంగతి అలా ఉంటే ఇక కులాల వారీగా కూడా సమ్మేళనాలను షురూ చేశాయి. గిరిజనులు అధికంగా ఉన్న సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలోని బొర్లగడ్డతండాకు ఇన్‌చార్జ్‌గా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను టీఆర్‌ఎస్‌ నియమించింది. ఆమె అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నారు. 

►మునుగోడులో మంగళవారం నాయీబ్రాహ్మణుల సమ్మేళనానికి బీజేపీ ఈటల రాజేందర్‌ హాజరై హామీలిచ్చారు. రజక కులస్తులతో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ సమావేశం అయ్యారు.

మునుగోడు నియోజకవర్గంలో ముఖ్య నేతలు, ఇన్‌చార్జీలంతా ఇప్పుడు కులాల ఓట్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ సామాజికవర్గం వారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి... ఆయా వర్గాలకు అక్కడ సంఘాలు ఏమైనా ఉన్నాయా? వాటికి నేతృత్వం వహిస్తున్నదెవరు? అన్న వివరాలను సేకరించాయి. టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రతి వంద ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించాయి. ఆ వంద మంది ఓటర్లలో ఎంత మంది ఏ కులం వారు ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు.

గ్రామాల్లో ఏ కులం ఓట్లు ఎక్కువగా ఉంటే ఆ కులం వారినే అక్కడ ఇన్‌చార్జీలుగా నియమించారు. వారు రంగంలోకి దిగి మనం మనం ఒకటి అంటూ సంబంధాలు కలుపుకుంటూ మా పార్టీకి ఓటేయండి. మీకు అండగా ఉంటామంటూ అభయం ఇస్తుండగా, వీలుకాని చోట కుల సంఘాలకు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల అభివృద్ధికి డబ్బులు ఇవ్వడం షురూ చేశారు. చౌటుప్పల్‌ మండలం డి.నాగారంలో రూ.5లక్షలతో పెద్దమ్మ గుడి కట్టించేందుకు బీజేపీ నేతలు కొబ్బరికాయ కొట్టగా అదే మొత్తంతో తాము కట్టిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు కొబ్బరికాయ కొట్టారంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

వివిధ పార్టీలు సేకరించిన కొన్ని కులాల వారీగా ఓటర్లు
గౌడ్‌ – 37,891, మాదిగ – 26,896, మాల – 9,967, రెడ్డి – 24,950, యాదవ (గొల్ల, కురుమ)– 25,856, పద్మశాలి – 18,615, లంబాడి – 10,334, ముస్లిం – 7,490, రజక – 6,752, మున్నూరుకాపు – 4,129, ముదిరాజ్‌ – 20,691, వడ్డెర – 3,850, కుమ్మరి – 5,205, కమ్మ – 4,880, నాయీబ్రాహ్మణ – 5,178, ఎరుకలి – 4064, బ్రాహ్మణ – 2076, విశ్వబ్రాహ్మణ – 4813, వైశ్య – 6841, వెలమ – 1360, క్రిస్టియన్‌ – 1027.  

మరిన్ని వార్తలు