Munugode Bypoll: మాకు మీ డబ్బొద్దు.. రోడ్లు వేయండి

13 Oct, 2022 05:11 IST|Sakshi
మునుగోడు మండలం కాశవారిగూడెంలో ఆ గ్రామ సమస్యలపై యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ 

మునుగోడులో సమస్యల పరిష్కారం కోసం పట్టుబడుతున్న ప్రజలు

ఎన్నికల ప్రచారం చేస్తున్న నేతల ముందు డిమాండ్లు

చౌటుప్పల్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ప్రశ్నించిన పౌరుడు

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెరపైకి తెస్తున్నారు. వాటిని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ మేరకు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్న ప్రధాన రాజకీయ పార్టీలకు తమ డిమాండ్లు తెలియజేస్తున్నారు. బుధవారం కూడా మునుగోడు మండలం కాశవారిగూడెంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

గత నెలలో చండూరు మండలంలోని పడమటితాళ్ల గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ గ్రామస్తులు గ్రామం పొలిమేరలో బ్యానర్‌ కట్టారు. దీంతో ఆ గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో నాయకులు పడ్డారు. గట్టుప్పల్‌ మండలంలోని తేరట్‌పల్లి గ్రామం బ్యాంకు కాలనీలో ఇటీవల ‘ప్రజా ప్రతినిధులకు గమనిక’ అంటూ బోర్డు రూపంలో ఒక బ్యానర్‌ ఏర్పాటు చేశారు. తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు (సీసీరోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలు) చేపట్టనందున ప్రజా ప్రతినిధులెవరూ ఓట్లు అడగడానికి ఈ కాలనీలో అడుగు పెట్టకూడదని, తమ సమస్యలను త్వరగా పరిష్కరించేవారే ఓట్లు అడిగేందుకు అర్హులంటూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. దీంతో వారి సమస్యలను పరిష్కరించేలా సంప్రదింపులు జరుగుతున్నాయి.

కాగా బుధవారం కాశవారిగూడెంలో ప్రజలు అలాంటి బ్యానరే ఏర్పాటు చేశారు. ‘మాకు మీరిచ్చే డబ్బులు వద్దు.. మా గూడేనికి రోడ్డు కావాలి..’ అంటూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ‘గ్రామ ప్రగతి మారలేదు. గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు, ప్రజా ప్రతిని ధులు, ఎందరో నాయకులు మారినా మా గతుకుల రోడ్డు, కనీస సౌకర్యాలు మార లేదు. అన్ని రాజకీయ పార్టీలకు విన్నపం.. రోడ్డు, మా గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించే నాయకులకే ఓట్ల కోసం మా కాశవారి గూడెంకు రాగలరు. మాకు తక్షణమే కల్వలపల్లి నుంచి కాశవారి గూడేనికి రోడ్డు వేయాలి. గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలి’ అంటూ బ్యానర్‌ ఏర్పాటు చేయడంతో నేతలు తలపట్టుకుంటున్నారు.

మంగళవారం చౌటుప్పల్‌ మండలం కోయలగూడెంలో ప్రచారం చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలి పిస్తే మీ ఊరికి రోడ్డు వేస్తామని చెప్పగా ఓ ఓటరు.. ‘మీ మా టలు నమ్మం’ అంటూ అడ్డు తగిలారు. దానికి మంత్రి ‘నువ్వు ఆ వర్గమా ఈ వర్గమా?’ అని ప్రశ్నించడంతో ‘ఓ ఓటరుగా అడుగు తున్నా’ అని ఆయన జవాబిచ్చారు.

మరిన్ని వార్తలు