మునుగోడు బైపోల్‌: నామినేషన్‌ వేసిననాడే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్‌

11 Oct, 2022 09:04 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్‌ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరులో నామినేషన్‌ దాఖలు చేసిన నాడే.. ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం గమనార్హం. ఫోన్‌ పే తరహాలో.. కాంట్రాక్ట్‌ పే అంటూ వేల పోస్టర్లను రాత్రికి రాత్రే అంటించారు ప్రత్యర్థులు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన ఆస్తులు, అప్పులు, పోలీసు కేసులు.. ఇతరత్ర వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్‌ అధికారికి సోమవారం అందజేసి.. నామినేషన్‌ వేశారు. అయితే..  రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా పోస్టర్లు ప్రచురించి.. గోడలకు అంటించారు.

మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఏర్పాట్లు చేసిన పోస్టర్లు దుమారం రేపుతోన్నాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ దర్శనమిస్తున్న పోస్టర్లు స్థానికుల్ని చర్చించుకునేలా చేస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. పైగా 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ పోస్టర్‌లో పొందుపర్చారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతోన్నాయి. 

ఈ పోస్టర్ల వ్యహారంపై బీజేపీ మండిపడుతోంది. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, ఇలా పోస్టర్లతో ఆయనను ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు