మునుగోడు ఉప ఎన్నిక: ఈసీ క్లియరెన్స్‌తో రాజగోపాల్‌రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌

1 Nov, 2022 16:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. 

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. సుమారు రూ.5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్‌ఎస్‌ పార్టీ, రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీఆర్‌ఎస్‌ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీ తేల్చింది. రాజగోపాల్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాల్లేవని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఓట‌ర్లకు న‌గ‌దు పంపిణీ చేసేందుకు కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ప‌లువురు వ్యక్తులు, సంస్థల‌కు న‌గ‌దు బ‌దిలీ చేశారన్నది టీఆర్ఎస్‌ ఆరోపణ. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.  న‌గ‌దు లావాదేవీల‌పై సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల లోపు స‌మాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్‌.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి..: బండి సంజయ్‌

మరిన్ని వార్తలు