పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే కౌంటింగ్‌ ఎందుకు చేయలేదు..

9 Nov, 2022 08:04 IST|Sakshi

నల్గొండ (చండూరు): మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేసి బ్యాలెట్‌ పేపర్‌తో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ అన్నారు. ఆయన  మంగళవారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్‌ పేపర్‌ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవి నీతి, అక్రమాలు జరగనప్పుడు.. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్‌ చేయలేదన్నారు.

ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింక్‌ తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌కు వేసిన సీల్‌ మారిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్‌ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్‌ స్టేషన్‌లలో అధికారులు వృద్ధులతో రెండో నంబర్‌కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతో పాటు అందరికి తెలిసినా కూడా ఈ ఎన్నికను ఎందుకు రద్దుచేయలేదో చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చీకొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారని పాల్‌ చెప్పారు.    

మరిన్ని వార్తలు