మునుగోడు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్‌

26 Oct, 2022 21:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల వేళ.. అధికార పక్ష నేతలకు గాలం వేసే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో.. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నించిన మధ్యవర్తీలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. వారి నుంచి భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ డీల్‌ విలువ సుమారు రూ.100 కోట్లు నగదు ఉంటుందని అంచనా. నోట్ల కట్టలతో పోలీసులకు చిక్కిన వారిలో రామంచంద్ర భారతి, సోమయాజుల స్వామి, నందకుమార్‌, తిరుపతిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా ఢిల్లీకి చెందిన వారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ డెక్కన్‌ ప్రైడ్‌ హోటల్‌ చెందిన నందకుమార్‌ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నందు కిషన్ రెడ్డికి సన్నిహితుడు అని ప్రచారం ఊపందుకుంది.

మరోవైపు.. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్లాన్‌ చేసిందంటూ టీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి స్కెచ్‌ వేశారని ఆరోపించింది. ఫిరాయింపుల కోసం భారీగా నగదు ఆఫర్‌ చేశారని పేర్కొంది. ఆపరేషన్‌లో లక్క్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

మొయినాబాద్ ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా  అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో డీల్ చేసిన నందు, తిరుపతి, రామ చంద్ర భారతి, సింహా యాజులు. వంద కోట్ల రూపాయల డీల్‌ కాగా.. స్పాట్‌లో 15 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు సమాచారం. 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే దాడి

తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభ పర్వం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ప్రలోభ పర్వం గురించి సమాచారం అందుకోగానే రంగంలోకి దిగినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్‌లోని బేరసారాలు నడుస్తున్న ఫామ్‌ హౌజ్‌పై రైడ్‌ చేశామని, ముగ్గురు దొరికారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

రామచంద్రభారతి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందింది. సింహయాజులు తిరుపతి నుంచి వచ్చాడు. నందకుమార్‌, సింహయాజులు.. ఫరిదాబాద్‌ నుంచి రామచంద్రభారతిని ఇక్కడికి తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పదవులు, డబ్బు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారు. నందకుమార్‌ మధ్యవవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం ఉంది అని సీపీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు