బీఆర్‌ఎస్‌పై బండి ఫైర్‌: దుబ్బాకలో రూ.10వేలు, హుజురాబాద్‌లో 20వేలు, మునుగోడులో 40వేలు

7 Oct, 2022 17:28 IST|Sakshi

సాక్షి, వరంగల్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఇటీవల హనుమకొండలో మృతి చెందిన ఏబీవీపీ రాష్ట్ర మాజీ  అధ్యక్షులు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా మాట్లాడారు బండి సంజయ్‌. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాలుపడుతుందని ఆరోపించారు.

‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల అక్రమాలను అడ్డుకుంటాం. దుబ్బాకలో ఓటుకు రూ. 10వేలు, హుజురాబాద్‌ రూ. 20 వేలు పంచిన బీఆర్ఎస్ ఇప్పుడు మునుగోడులో ఓటుకు రూ. 40వేలు పంచేందుకు సిద్ధమైంది. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, మద్యం మునుగోడుకు పంపించడం చూస్తే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్‌లో ఉన్నారో అర్థమవుతుంది.‌’ అని దుయ్యబట్టారు బండి సంజయ్‌.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా కోసం రాజీనామా చేశాడని మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో బీజెపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్‌ కుమార్‌.‌ ఫోన్‌ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. నీచమైన, దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్‌దేనని, బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు బండి సంజయ్.

ఇదీ చదవండి: మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్‌

>
మరిన్ని వార్తలు