మునుగోడులో పోస్టర్‌ వార్‌

23 Oct, 2022 09:44 IST|Sakshi

మొన్నటి వరకు సమస్యలపై ఫ్లెక్సీలు

ఇప్పుడు పార్టీలు, అభ్యర్థులు, నేతలపై ఆరోపణలు, విమర్శలతో పోస్టర్లు 

ఇంతకుముందు బీజేపీపై.. తాజాగా టీఆర్‌ఎస్‌ నేతలపై.. 

ఫ్లెక్సీలు ఎవరు వేస్తున్నారన్న దానిపై పార్టీల ఆరా 

చౌటుప్పల్‌ మండలంలో ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ అండ్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్‌ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. 

ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. 
మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్‌ ప్రజలు’అంటూ సెప్టెంబర్‌ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్‌రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి.  తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు.

ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు